బీజేపీలోకి విశాల్.. క్లారిటీ ఇచ్చిన మేనేజర్! - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీలోకి విశాల్.. క్లారిటీ ఇచ్చిన మేనేజర్!

September 15, 2020

vishyal

తమిళనాడులో బలపడడానికి బీజేపీ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో తమిళనాడుకి చెందిన పలువురు ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఇప్పటికే మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై బీజేపీలో చేరిన సంగతి తెల్సిందే. తాజాగా నటుడు విశాల్ కూడా బీజేపీలో చేరనున్నాడని గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. విశాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్ అపాయింట్‌మెంట్‌ను కోరాడని వార్తలు వచ్చాయి. దీనిపై విశాల్ మేనేజర్ హరికృష్ణన్ స్పందిస్తూ.. విశాల్ రాజకీయాల్లోకి రావడం లేదని ఈ పుకార్లను ఎవరు నమ్మవద్దని తెలిపారు. 

గతంలో తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణం తరవాత విశాల్ ఆర్కే నగర్ ఉప ఎన్నికల బరిలో పోటీ చేయడానికి నామినేషన్ వేశారు. తరువాత ఆ నామినేషన్ వెనక్కి తీసుకున్నారు. సినీ నిర్మాతల సంఘంలో పోటీ చేసి గెలిచారు. దాంతో విశాల్ కు రాజకీయాలపై ఆసక్తి ఉందని గమనించిన బీజేపీ అతన్ని పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ కార్యాలయాన్ని కూల్చివేసినా ఘటనపై విశాల్ ఘాటుగా స్పందించాడు. ‘డియర్ కంగనా.. మీరు చేస్తున్న పనులు చూసి నిజంగానే సలాం చేస్తున్నాను. మీ ధైర్యం నాకు నచ్చింది. ఏది తప్పు ఏది ఒప్పు అనేది పక్కనబెడితే ప్రభుత్వంపై మీరు చేస్తున్న పోరాటం నాకు నచ్చింది. మీలో నాకు ఓ భగత్ సింగ్ కనిపిస్తున్నాడు’ అని పేర్కొన్నాడు. దీంతో విశాల్ బీజేపీకి దగ్గర అవుతున్నారని అంతా భావించారు.