దూర ప్రయాణాలు చేసి అలసిపోయిన ప్రయాణికులకు శుభవార్త. ఎక్కువ సేపు కూర్చొని, లేదా నిల్చొని ప్రయాణం చేసేవారు ఇకపై ఒళ్లునొప్పులు, కాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు. దక్షిణ మధ్య రైల్వే అలాంటి ప్రయాణికుల కోసం ఓ ప్రత్యేక సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. విజయవాడ రైల్వేస్టేషన్లో రోబోటిక్ మసాజ్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఈ అత్యాధునిక మసాజ్ సెంటర్ ద్వారా ప్రయాణికులు అతి తక్కువ రుసుముతో బాడీ, ఫుట్ మసాజ్ సేవలను పొందొచ్చు. ఒకటో నంబరు ప్లాట్‌ఫాంపై ఏర్పాటు చేసిన ఈ సెంటర్లో రెండు రోబోటిక్ బాడీ మసాజ్ కుర్చీలు, ఒక ఫుట్ మసాజ్ కుర్చీ అందుబాటులో ఉన్నాయి.
టికెట్‌యేతర ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టిసారించిన దక్షిణ మధ్య రైల్వే ఈ సెంటర్ ను ఏర్పాటు చేసింది. ద.మ.రై. డివిజినల్ మేనేజర్ శివేంద్ర మోహన్ సోమవారం దీనిని ప్రారంభించారు. బాడీ మసాజ్‌కు రూ. 60, ఫుట్ మసాజ్‌కు రూ. 30 రుసుము చెల్లించి రోబోటిక్ మసాజ్ సేవలను పొందొచ్చని ఐఆర్టీఎస్ సీనియర్ డీసీఎం వి.రాంబాబు తెలిపారు. కాగా, స్టేషన్లో ఇటీవల ఫిష్ స్పా, హ్యాండ్లూమ్స్ అండ్ క్రాఫ్ట్స్, మొబైల్ యాక్ససరీలకు సంబంధించిన అవుట్లెట్లను ప్రారంభించారు.