ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు గోరీ కట్టించాడు.. నిజంగానే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు గోరీ కట్టించాడు.. నిజంగానే..

June 18, 2022

కంప్యూటర్ వినియోగించే ప్రతీ వ్యక్తికి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ గురించి తెలుసు. బిల్‌గేట్స్ మైక్రోసాఫ్ట్ కంపెనీకి చెందిన ఈ వెబ్ బ్రౌజర్ దాదాపు 27 ఏళ్ల పాటు సేవలందించింది. అయితే మార్కెట్లో రకరకాల బ్రౌజర్లు రావడంతో మైక్రోసాఫ్ట్ దీనిని ఈ జూన్ 15 నుంచి నిలిపివేసింది. 1995లో విండోస్ 95లో భాగంగా ప్రారంభమైన దీనిని నిలిపివేయడంతో నెటిజన్లు రకరకాలుగా తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలో దక్షిణ కొరియాకు చెందిన జంగ్ కి యంగ్ అనే ఇంజినీర్ ఏకంగా దీనికి సమాధి కట్టాడు. రూ. 25 వేల ఖర్చుతో నిర్మించిన ఈ సమాధిపై ప్రారంభ, ముగింపు తేదీలను ముద్రించాడు. దాంతో పాటు ‘ఈ వెబ్ బ్రౌజర్ ఇతర వెబ్ బ్రౌజర్లను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడేది’ అంటూ రాసుకొచ్చాడు. తన సోదరుడి రెస్టారెంట్ ముందు నిర్మించిన ఈ సమాధి ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీంతో అతడిని పలకరించిన మీడియా.. సమాధి నిర్మించడానికి గల కారణాన్ని అడిగింది. దానికి జంగ్ ‘ఇది ఎన్నో ఏళ్ళుగా ఉపయోగపడింది. బ్రౌజర్ సేవలు ఆగిపోవడం నాకు నచ్చట్లేదు కానీ, తప్పట్లేదు. కాలంతో పాటు మనం మారాలి. కేవలం నవ్వించడానికే ఈ పని చేశాను. అయితే ఇంతలా వైరల్ అవుతుందని అనుకోలేదు’ అని బదులిచ్చాడు.