నటి మీనా భర్త మృతికి పావురాలే కారణమా.!
ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్ (48) మరణవార్తను ఆమె అభిమానులతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతోంది. చిన్న వయసులోనే శ్వాసకోశ సమస్యతో హఠాన్మరణం చెందడం చాలామందిని షాక్ కు గురిచేసింది. మంగళవారం రాత్రి చెన్నై ఆళ్వార్ పేటలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచిన విద్యాసాగర్ మృతికి సంబంధించి తమిళనాడు స్థానిక పత్రికల్లో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పావురాల వ్యర్థాల నుంచి వచ్చే గాలిని ఎక్కువగా పీల్చడం వల్లే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది ప్రారంభంలో అంటే జనవరి నెలలో మీనా కుటుంబం అంతా కోవిడ్ బారిన పడింది. మీనా, ఆమె కుమార్తె నైనికా కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. కానీ.. మీనా భర్త విద్యాసాగర్ కోలుకున్నప్పటికీ ఆయన ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. అయితే మీనా వాళ్లింటికి అతి చేరువలో పావురాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయని.. వాటి వ్యర్థాల నుంచి వచ్చిన గాలిని పీల్చడం వల్లే ఆయనకు శ్వాసకోశ సమస్యలు తలెత్తాయని, గత కొంతకాలంగా దానికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్నారని కథనాలు వచ్చాయి.
కానీ ఈ క్రమంలో ఆయనకు లంగ్ ఇన్‌ఫెక్షన్ ఎక్కువై హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. పరీక్షలు చేసిన డాక్టర్స్ విద్యాసాగర్‌కి లంగ్స్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరం ఉంటుందని చెప్పి చికిత్సను అందిస్తూ వచ్చారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి ఎవరైనా అవయవ దానం చేస్తే ఊపిరితిత్తులను ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని చికిత్సను కొనసాగిస్తూ వచ్చారు. కానీ పరిస్థితి చేయి దాటిపోయింది. దాతలు దొరకకపోవడంతో చివరకు ఆయన మృతి చెందారు. 2009లో మీనా, విద్యాసాగర్ వివాహం చేసుకున్నారు.