తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి..మరో రెండు రోజుల్లో.. - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి..మరో రెండు రోజుల్లో..

June 14, 2022

తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. సోమవారం మహబూబ్ నగర్‌లో భారీ వర్షం కురిసింది. రాగల 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని ప్రాంతాలకు ఈ రుతుపవనాలు చేరనున్నాయి. దీంతో రెండు లేదా మూడు రోజుల్లో చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

”ప్రతి సంవత్సరం రాష్ట్రంలోకి రుతుపవనాలు జూన్ 8న ప్రవేశిస్తాయి. కానీ, ఈసారి ఆరేబియా మహాసముద్రం, బంగాళాఖాతంలో గాలులు బలహీనంగా ఉండడంతో రుతుపవనాలు ఆలస్యమైయ్యాయి. నైరుతి రుతుపవనాలు గత మూడు రోజుల ముందుగానే కేరళ తీరాన్ని తాకినా, రాష్ట్రంలోకి రావడానికి ఐదు రోజుల ఆలస్యమైంది. గత ఏడాది జూన్ 5వ తేదీన నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ఈ ఏడాది ఆలస్యంగా 18న ప్రవేశించాయి. రాష్ట్రంలో పూర్తిస్థాయిలో రుతుపవనాలు విస్తరించడానికి నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉంది” అని వాతావరణ శాఖ అధికారులు వివరాలను వెల్లడించారు.

రుతుపవనాల రాకతో తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 17 వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ప్రాథమికంగా హెచ్చరికలు జారీ చేసింది.

మరోవైపు హైదరాబాద్‌లో నేడు ఉదయం పలుచోట్ల వర్ష పడింది. గతకొన్ని రోజులుగా ఉక్కబోతతో అల్లాడిన నగరవాసులకు కాస్తంత ఉరట లభించింది. నేడు కురిసిన వర్షాన్ని బట్టిచూస్తే, మరో మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వర్షాల కోసం తెలంగాణ రైతులు అతుత్రగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పంటకు సంబంధించి, విత్తనాలు, ఎరువులను కోనుగోలు చేశారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ రైతులకు శుభవార్తను చెప్పింది.