భారత వాతావరణ విభాగం(ఐఎండీ) శుభవార్త చెప్పింది. సోమవారం అండమాన్ నికోబర్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు ప్రకటించింది. ప్రస్తుతం అండమాన్ నికోబర్ దీవులు సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
నైరుతి రుతుపవనాలు మే నెలాఖరు నాటికి కేరళను తాకుతాయని, తెలంగాణలో జూన్ మొదటివారంలో వీటి ప్రవేశం ఉంటుందని పేర్కొంది. “సోమవారం నుంచి బుధవారం వరకు తమిళనాడులో భారీ వర్షాలు పడొచ్చు. లక్షద్వీప్‌లో రెండు రోజులు వానలు జోరుగా కురుస్తాయి. బుధవారం కర్ణాటకలో అతి భారీ వర్షాలు పడతాయి” అని ఐఎండీ అంచనా వేసింది. ఇక దక్షిణ తమిళనాడుకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఆ ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఏపీలో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోనూ… తెలంగాణలోనూ అనేక చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది.