కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. 3 రోజుల ముందే.. - MicTv.in - Telugu News
mictv telugu

కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. 3 రోజుల ముందే..

May 29, 2022

భారత వాతావరణ శాఖ ఓ కీలక విషయాన్ని దేశ ప్రజలకు తెలియజేసింది. మూడు రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్లు అధికారులు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సాధారణంగా జూన్ 1 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకడం పరిపాటి. కానీ, ఈసారి అనుకూల పరిస్థితుల నేపథ్యంలో, నైరుతి సీజన్ మూడు రోజుల ముందుగానే మొదలైనట్లు..వాతావరణశాఖ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర పేర్కొన్నారు.

మృత్యుంజయ్‌ మహాపాత్ర మాట్లాడుతూ..”ఇటీవలే బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అసని’ తుఫాను కారణంగా గత నెల నుంచి రుతుపవనాల్లో వేగం పెరిగింది. మే 27 నాటికి కేళర తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ ‘నైరుతి’ ఆగమనంతో దేశంలో వేసవి తాపం నుంచి ప్రజలకు ఉపశమనం కలగనుంది. భారతదేశంలో అత్యధిక వర్షపాతం ఈ నైరుతి రుతుపవనాల వల్లే కలుగుతుంది. దేశ వ్యవసాయ రంగం కూడా ఈ రుతుపవనాలపైనే అత్యధికంగా ఆధారపడుతోంది. ఈ ప్రభావంతో కేరళ, లక్షద్వీప్ ప్రాంతంలో భారీ స్థాయిలో వర్షపాతం నమోదు అవుతుంది” అని ఆయన అన్నారు.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. వచ్చే వారం రోజుల వరకు నైరుతి రుతుపవనాలు తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ వరకు విస్తరించే అవకాశాలు లేవని, ఆయా రాష్ట్రాల్లో ‘నైరుతి’ ప్రభావం కనిపించడానికి కొంత సమయం పడుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ ‘స్కైమెట్’ పేర్కొంది.