వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల రైతులకు శుభవార్త చెప్పింది. నైరుతి రుతుపవనాలు సోమవారం తెలంగాణ, ఏపీలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని తెలిపింది. శనివారం నాటికి గోవా, కొంకణ్, కర్ణాటక ప్రాంతాల్లో కొంతమేర విస్తరించాయని పేర్కొంది. పశ్చిమ భారత తీర ప్రాంతాలన్నింటా రుతుపవనాలు విస్తరించడంతో ఆది, సోమవారాల్లో తెలంగాణ, ఏపీల్లోకి ప్రవేశిస్తాయని అంచనా.
పశ్చిమ భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా.. మరికొన్ని చోట్ల ఎండలు దంచికొడుతున్నాయి. 40 డిగ్రీలకుపైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లోనూ ఎండలు భారీగానే ఉన్నాయి. దీంతో ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.