ఆలాపనకు ఆదిమంత్రమై.. మరపురాని బాలు పాటలు..  - MicTv.in - Telugu News
mictv telugu

ఆలాపనకు ఆదిమంత్రమై.. మరపురాని బాలు పాటలు.. 

September 25, 2020

బాలు పాట కోసమే పుట్టాడు. అతని గొంతులో తెలుగు తేనెలూరింది. పరవళ్లు తొక్కింది, పర్వతాలను తాకింది. తెలుగు పాట ఉన్నంతవరకు బాలు స్వరం ఈ భూమిపై వినిపిస్తూనే ఉంటుంది. తెలుగు సినీసంగీత చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించి వెళ్లిపోయిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం ఆయన కెరీర్ ప్రారంభించినప్పటినుంచే వర్ధమానగాయకులకు ఆదర్శం. యాభై ఏళ్లపాటు, మూడు తరాల తెలుగు శ్రోతలను తన గానరసవాహినిలో ముంచెత్తిన బాలు గొంతులోంచి జాలు వారిని పాటల్లో ఆణిముత్యాలను దోసిట పట్టుకుందాం.. 

ప్రతి రాత్రీ వసంత రాత్రి.. 

కెరీర్ తొలినాళ్లలో బాలు ‘ఏకవీర’ చిత్రం కోసం ఘంటసాలతో కలసి పాడిన ‘ప్రతి రాత్రీ వసంత రాత్రి’ ఇప్పటికే అనేక సంగీత కచేరీల్లో వినిపిస్తూ ఉంటుంది. దిగ్గజ గాయకుడితో కలసి పాడటం అంటే మాటలు కాదు. బాలు ఏమాత్రం తడబడకుండా పాటను సుతిమెత్తగా లాగించేశారు. 

‘ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి
ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి
బ్రతుకంతా ప్రతినిమిషం పాట లాగ సాగాలీ

ఒరిగింది చంద్రవంక వయ్యారి తారవంక
ఒరిగింది చంద్రవంకా వయ్యారి తారవంక..’

 

ఏ దివిలో విరిసిన పారిజాతమో.. 

కుర్రవయసులో కోరికలు గుర్రాల్లా పరిగెడతాయి. ప్రేమించిన మనిషి కోసం కళ్లు కాయలు కాస్తాయి. ‘కన్నె వయసు’ చిత్రంలో బాలు అజరామరంగా ఆలపించిన ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’ పాట ప్రేమికుడి గుండెచప్పుడుకు అద్దం పడుతుంది. దాశరథి అక్షరాలు, సత్యం సంగీతం, బాలు గొంతు కలసి జులగ్బందీగా సాగిన ఆ పాట ఎవర్ గ్రీన్ లవ్ సాంగ్. 


‘నీ రూపమే దివ్య దీపమై
నీ నవ్వులే నవ్యతారలై
నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే

ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో..’ 

అని బాలు పాడుతుంటూ హయ్ చేయని వాడే ప్రేమికుడే కాదు. 

జాబిల్లి కోసం ఆకాశమల్లే 

ఆత్రేయ పాటలు రాయక నిర్మాతలను, రాసి శ్రోతలను ఏడిపిస్తాడు. అలాంటి కలం నుంచి జాలువారి ‘జాబిల్ల కోసం ఆకాశమల్లే..’ పాటను బాలు గుండెతడితో మన చెవుల్లో ఒంపుతాడు. ‘మంచి మనసులు’(1985) చిత్రంలోని ఈపాటను వెన్నెల్లో నిలబడి వింటేనే ఆ అనుభూతే వేరు. 

‘నీ ఊసులనే నా ఆశలుగా
నా ఊహలనే నీ బాసలుగా
అనుగొంటిని కలగంటిని నే వెర్రిగా
నే కన్న కలలు నీ కళ్ళతోనే
నాకున్న తావు నీ గుండెలోనే
కాదన్ననాడు నేనే లేను…’

 

ఆ కనులలో కలల నా చెలి 

ప్రేమలో మునిగి తేలేవారికి కళ్ల నిండా ప్రేమించిన మనిషే. నిద్రపోయినా, మేల్కొన్నా నిరంతరం ఆమె/అతని ధ్యాసే. ‘నిద్ర పట్టడం లేదు.. ’ అని సింపుల్‌గా చెప్పినా.. 


‘‘గొంతులోన గుండె పిలుపులా 
సంధ్యలోన అందె మెరుపులా 
గొంతులోన గుండె పిలుపులా 
సంధ్యలోన అందె మెరుపులా 
ఆ కనులలో కలల నా చెలీ 
ఆలాపనకు ఆది మంత్రమై.. ’

అని కవిత్వం ఒలకబోసినా సారాంశం ఒకటే. ప్రేయసి కోసం ఎదురు చూపే. ‘ఆలాపన’(1986) చిత్రంలోని ఈ పాట.. ఇళయరాజా, సినారె, బాలు, జానకి కలిసి అద్భుత గానవర్షం. 

తరలి రాద తనే వసంతం 

గాలి, నీరు, నిప్పు.. అందరివీ. పాట కూడా అందరిదీ. అయితే ఆచారాలు, సంప్రదాయాల పేరుతో కొందరు సంగీతానికి అనర్హులు అనే మూర్ఖశిఖామణులు ఇప్పటికీ మనచుట్టూ ఉన్నారు. వారి ముసుగును తొలగించే ‘రుద్రవీణ’లోని బాలు పాట ‘తరలి రాద తనే వసంతం’ మెసేజ్ ఓరియెంటెడ్ పాటలకు పెద్ద ఒరవడి.. 

 


తరలి రాద తనే వసంతం..
తన దరికి రాని వనాల కోసం
వెన్నెల దీపం కొందరిదా.. అడవిని సైతం వెలుగు కదా
వెన్నెల దీపం కొందరిదా.. అడవిని సైతం వెలుగు కదా
ఎల్లలు లేని చల్లని గాలి.. అందరి కోసం అందును కాదా’

బాలు పాడిన పాటలన్నీ గొప్పవి కాకపోవచ్చు. కొన్ని కేవలం డబ్బు కోసమే పాడి ఉండొచ్చు. కానీ పాటకు ప్రాణం పోయడానికి ఆయన ఎంత సాధన చేస్తారో ఆయన స్వరమే నిదర్శనం. ప్రేమే కాదు, విరహం, దు:ఖం, శృంగారం, హాస్యం.. ఏదైనా సరే దానిపై ఆయన ముద్ర సుస్పష్టం.