తెలంగాణ సీఎం కేసీఆర్తో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తున్నది. దాదాపు రెండుగంటలకుపైగా భేటీ కొనసాగింది. దేశ రాజకీయాల్లో బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు, వాటిని ఎదుర్కొనేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయంపై చర్చించినట్లు సమాచారం. అఖిలేష్ యాదవ్ వెంట సమాజ్ వాది పార్టీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ ఉన్నారు.
ఈ భేటీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వరుసగా మూడు రోజుల పాటు విచారించడం, పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ, అర్పిత ఛటర్జీ నివాసాలపై దాడులు సాగించడం వంటి పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. ప్రతిపక్ష పార్టీల నాయకులపై సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ అధికారులను ప్రయోగిస్తోందని, దీన్ని అడ్డుకోవడానికి చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక గురించి కేసీఆర్-అఖిలేష్ యాదవ్ మాట్లాడినట్లు తెలుస్తోంది.
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై ఇంకా టీఆర్ఎస్ నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయంలో వీరి మధ్య ఏదైనా చర్చ జరిగిందా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇరువురి మధ్య ఎలాంటి చర్చ జరిగిందనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో జయాపజయాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇదివరకే ఇచ్చిన రిపోర్ట్ గురించి కూడా జాతీయ నాయకులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.