నిన్న స్వతంత్రం.. నేడు ఉక్కుపాదం.. - MicTv.in - Telugu News
mictv telugu

నిన్న స్వతంత్రం.. నేడు ఉక్కుపాదం..

October 28, 2017

స్పెయిన్‌లోని కేటిలోనియా ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఇంతవరకు పాక్షిక స్వయం ప్రతిపత్తి ఉన్న ఈ ప్రాంతం శుక్రవారం స్వతంత్రం ప్రకటించుకోగా, శనివారం స్పెయిన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఆ ప్రాంతానికి ఉన్న స్వయంప్రతిపత్తిని రద్దు చేసి, తన ప్రత్యక్ష అధీనంలోకి తీసుకుంది. ఆ ప్రాంతంలోని పరిపాలనను పర్యవేక్షించే బాధ్యతను ఉప ప్రధాని సొరాయా సెయింజ్‌కు అప్పగించింది.

అక్కడి శాంతిభద్రతల బాధ్యతను హోం మంత్రికి కట్టబెట్టారు. తమది గణతంత్ర రాజ్యమని ప్రకటించుకుంటూ కేటలోనియా పార్లమెంటు శుక్రవారం తీర్మానాన్ని ఆమోదించింది. సభలో 135 మంది సభ్యులు ఉండగా 70 మంది మంది తీర్మానాన్ని ఆమోదించగా, 10 మంది వ్యతిరేకించారు. మిగతావారు వాకౌట్ చేశారు. అయితే ఈ స్వాతంత్య్ర ప్రకటనను స్పెయిన్‌ ప్రభుత్వంతోపాటు అంతర్జాతీయ సమాజం కూడా గుర్తించలేదు. కేటలోనియా ధనిక ప్రాంతం. దేశ ఎగుమతుల్లో 20 శాతం ఇక్కడి నుంచే సాగుతున్నాయి. స్పెయిన్‌తో కలిసి ఉండడం వల్ల తమకు రాజకీయంగా, ఆర్థికంగా తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ ఆ ప్రాంత ప్రజలు స్వతంత్ర్యం కోసం ఉద్యమిస్తున్నారు. వేర్పాటువాద నేత కార్లెస్‌ ప్యూగ్డెమెంట్‌ కేటలోనియా ప్రభుత్వానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాయి. ఈ ప్రాంతానికి స్వాతంత్రం కల్పించాలా, వద్దా అన్నఅంశంపై ఇటీవల ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించగా 90 శాతం మంది స్వతంత్రం కావాలన్నారు. అయితే ఓటింగ్ లో 43 శాతం మందే పాల్గొన్నారు. దీంతో రిఫరెండానికి విశ్వసనీయత లేదని స్పెయిన్ వాదించింది.