“సిస్ట‌ర్4 ఛేంజ్' వెబ్‌సైట్‌ను ప్రారంభించిన లోక్‌స‌భ స్పీక‌ర్‌..! - MicTv.in - Telugu News
mictv telugu

“సిస్ట‌ర్4 ఛేంజ్’ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన లోక్‌స‌భ స్పీక‌ర్‌..!

August 4, 2017

సిస్ట‌ర్4ఛై్ంజ్ వెబ్‌సైట్‌ను లోక్‌స‌భ స్పీక‌ర్ సుమిత్రామ‌హాజ‌న్ ప్రారంభించారు. శుక్ర‌వారం పార్ల‌మెంటులో త‌న ఛాంబ‌ర్‌లో స్పీక‌ర్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. చెల్లెలికి సోద‌రుడు ర‌క్ష‌- సోద‌రుడికి హెల్మెట్ ర‌క్ష నినాదంతో నిజామాబాద్ ఎంపి, తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత సిస్ట‌ర్4ఛేంజ్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఎంపి క‌విత చేస్తున్న కృషిని స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ అభినందించారు. సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ  ప్ర‌తి మ‌హిళా కూడా త‌న సోద‌రులు క్షేమంగా ఉండాల‌ని కోరుకుంటూ  రాఖీ పండుగ నాడు అన్న‌ద‌మ్ముల్ల‌కు రాఖీలు క‌డుతుంటార‌ని స్పీక‌ర్ తెలిపారు. రోడ్డు ప్ర‌మాదాల్లో చ‌నిపోతున్న బ్ర‌ద‌ర్స్‌ను చూసి ఎంపి క‌విత‌ చ‌లించి పోయార‌ని, హెల్మెట్ ధ‌రించాల‌న్న అవగాహ‌న క‌ల్పించ‌డ‌మే టూవీల‌ర్స్ ప్రాణాల‌ను కాపాడేందుకు వీల‌వుతుంద‌ని ఆమె భావించార‌న్నారు.  క‌విత‌ తాను కూడా సోద‌రికావ‌డం వ‌ల్లే ఇలా స్పందించి..సిస్ట‌ర్స్ 4ఛేంజ్ కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చార‌ని తెలిపారు. ఈ ప్ర‌చార ఉద్య‌మాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపైనా ఉంద‌న్నారు సుమిత్రా మ‌హాజ‌న్‌.

ఎం.పి కవిత మాట్లాడుతూ…

అనంత‌రం కల్వకుంట్ల క‌విత మీడియాతో మాట్లాడుతూ ర‌క్షా బంధ‌న్ పండుగ మ‌న దేశానికి చెందిన విశిష్ట‌మైన పండుగ అని  అన్నారు. మ‌న దేశంలో త‌ప్ప ప్ర‌పంచంలో ఎక్క‌డా ర‌క్షాబంధ‌న్ పండుగ జ‌ర‌గ‌ద‌న్నారు. అన్నా-చెల్లెల్లు, అక్కా-త‌మ్ముళ్ల సోద‌ర‌భావానికి ప్ర‌తీక‌గా మ‌నం ర‌క్షాబంధ‌న్ పండుగ‌ను జ‌రుపుకుంటామ‌ని చెప్పారు. త‌మ సోద‌రులు సుఖ‌సంతోషాల‌తో క‌ల‌కాలం జీవించాల‌ని సోద‌రీమ‌ణులు త‌మ సోద‌రుల‌కు ర‌క్ష‌ను క‌డుతారు. అయితే దురదృష్ట‌వ‌శాత్తూ మ‌న దేశంలో ప్ర‌తి రోజూ దాదాపు 400 మంది వ‌ర‌కు ద్విచ‌క్ర‌వాహ‌న దారులు రోడ్డు ప్ర‌మాదాల్లో చ‌నిపోతున్నార‌ని క‌విత తెలిపారు. కేవ‌లం ద్విచ‌క్ర‌వాహ‌న దారులు త‌ల‌కు హెల్మెట్ పెట్టుకోక‌పోవ‌డం వ‌ల్లే ఇలా మృత్యువాత ప‌డుతున్నార‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఒక్క 2015 సంవ‌త్స‌రంలో రోడ్డు ప్ర‌మాదాల్లో 45,540 మంది త‌మ ప్రాణాలు కోల్పోయార‌ని, వీటిలో 29శాతం మంది ద్విచ‌క్ర‌వాహ‌న ‌దారులేకావ‌డం త‌న‌ను క‌ల‌చివేసింద‌న్నారు.

ఈ నేప‌థ్యంలోనే సిస్ట‌ర్స్ 4 ఛేంజ్ ప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. ర‌క్ష‌ణ స్లోగ‌న్ మాత్ర‌మే కాద‌ని, ప్రాణాల‌కు అదోక మార్గ‌మ‌న్నారు. అన్నా త‌మ్ముళ్ల‌కు ‘రాఖీ క‌ట్టండి–హెల్మెట్‌ను కూడా బ‌హూక‌రించండి’ అని తాను ఇచ్చిన పిలుపుకు సోష‌ల్ మీడియా బాగా రెస్పాండ్ అయింద‌న్నారు. నెటిజ‌న్లు త‌మ మ‌ద్ధ‌తు తెలియ‌జేస్తున్నార‌ని, అన్ని వ‌ర్గాల వారూ ప్ర‌చారంలో పాల్గొంటున్నార‌ని క‌విత తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రు సిస్ట‌ర్4 చేంజ్ కార్య‌క్ర‌మంలో పాల్గొనాల‌ని, ఇందుకోసం త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకోవాల‌ని క‌విత సూచించారు. ద్విచ‌క్ర‌వాహ‌నాలు న‌డిపే త‌మ సోద‌రీమ‌ణుల‌కు సోద‌రులు హెల్మెల్‌ను బ‌హూక‌రించ‌డం మ‌ర‌వకూడ‌ద‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో నిజామాబాద్ అర్బ‌న్‌, రూర‌ల్ ఎమ్మెల్యేలు బిగాల గ‌ణేవ్ గుప్తా, బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్‌, బోధ‌న్‌, ఆర్మూర్‌, కోరుట్ల ఎమ్మెల్యేలు ష‌కీల్ అమిర్‌, ఆశ‌న్న‌గారి జీవ‌న్ రెడ్డి, కె. విద్యాసాగ‌ర్ రావు, జ‌గిత్యాల నియోజ‌క వ‌ర్గం టిఆర్ ఎస్ ఇంఛార్జి డాక్ట‌ర్ సంజ‌య్ కుమార్ పాల్గొన్నారు.

https://www.sisters4change.org/