నల్లమలపై నాన్నతో మాట్లాడుతా.. భయపడకండి.. కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

నల్లమలపై నాన్నతో మాట్లాడుతా.. భయపడకండి.. కేటీఆర్

September 13, 2019

తెలంగాణకు ప్రాణవాయువు అందించే నల్లమలలో యురేనియం తవ్వకాలు ఆపాలని పెద్ద ఎత్తున నిరసనగొంతులు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశంపై చాలామంది మేథావులు, సామాజిక కార్యకర్తలు, రచయితలు, ప్రకృతి ప్రేమికులు స్పందిస్తున్నారు. ‘సేవ్ నల్లమల’ అంటూ నినదిస్తూ ఉద్యమాన్ని నడుపుతున్నారు. అడవి తల్లినే నమ్ముకున్నామని, తమ జీవితాలు ఛిన్నాభిన్నమవుతాయని గిరి పుత్రులు కంటతడి పెడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా వ్యక్తమవుతున్న అందరి ఆందోళనను నేను చూస్తున్నాను. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి.. ఆయనతో వ్యక్తిగతంగా చర్చిస్తాను’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. 

దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. దేశంలో అతిపెద్ద పులి అభయారణ్యం, ఆదివాసీల నిలయం, గలగల పారే కృష్ణమ్మ పరవళ్లతో తెలుగు రాష్ట్రాలకు ప్రాణవాయువు అందిస్తూ, జీవ వైవిద్యానికి నెలవైన నల్లమల అడవుల పరిరక్షణకు అడుగేద్దాం, యురేనియం తవ్వకాలను అడ్డుకుందాం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నల్లమలను రక్షించాలని రాజకీయ నేతలతో పాటు గిరిజన సంఘాలు, సినీ ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు. యురేనియంతో పచ్చటి అడవులను నాశనం చేయొద్దని గళం విప్పుతున్నారు.

టాలీవుడ్ నుంచి విజయ దేవరకొండ, పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్, అనసూయ, సమంత, రామ్‌లు సేవ్ నల్లమల ఉద్యమానికి మద్దతు తెలిపారు. యురేనియం తవ్వకాలతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడటమే కాకుండా.. అది ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతగా నిరసన వ్యక్తమవుతున్న క్రమంలో కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరుతున్నారు.