‘రోజా’… మణిరత్నం దర్శకత్వంలో 1992 సం.లో వచ్చిన ఈ సినిమా ఎంతోమంది సినీ అభిమానులకు ఆల్ టైమ్ ఫేవరేట్. సినిమాలో హీరో హీరోయిన్ల నటనతోపాటు… అంతకంటే ఎక్కువగా ఎలివేట్ అంశం ఆ సినిమాకు అందించిన మ్యూజిక్. ఆ సినిమాలో సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ప్రతీది ప్రత్యేకమే. ఇంతకుముందెన్నడూ ఆ సంగీతానికి ప్రతీ ఒక్కరూ ఫిదా అయ్యారు. వింటేనే కాదు.. మామూలుగా ఆ బీజీఎం గురించి తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పాటుకు గురికాకమానదు. రోమాలన్ని నిక్కబొడిచేలా ఆ సినిమాకు సంగీత సారధ్యం వహించింది ఓ మామూలు కుర్రాడు. అప్పటి వరకూ ఇతర మ్యూజిక్ డైరక్టర్ల వద్ద కీబోర్డ్ ప్లేయర్ గా పనిచేసిన అతడు.. కేవలం ఒకే ఒక్క సినిమాతో.. భారతదేశం మొత్తానికి పరిచయమయ్యాడు. అతడే ”ఏ ఆర్ రెహ్ మాన్”. మొదటి సినిమాతో జాతీయ పురస్కారం అందుకున్న సంగీత దర్శకుడు.
గిటార్, హార్మోనియం, పియానో, కీబోర్డు ప్లేయర్‌గా ఇళయరాజా, రమేష్ నాయుడు, రాజ్ కోటి లాంటి పలు సంగీత దర్శకుల ట్రూప్‌లో పనిచేస్తూ జీవితం ప్రారంభించిన ఆ కుర్రాడు పెద్దగా చదువుకున్నది లేదు. ఎందుకంటే తొమ్మిదేళ్ళ వయసులో తండ్రి దూరమవ్వడంతో.. కుటుంబ బాధ్యతను తనపై వేసుకున్నాడు ఆ కుర్రాడు. ముగ్గురు అక్కాచెల్లెళ్ళు, తల్లి.. మొత్తం ఐదుగురుగా గల ఆ మధ్యతరగతి కుటుంబానికి తానే దిక్కయ్యాడు. ఉన్నంతలో బతుకుతూ.. ఓ పూట తిని.. మరోపూట పస్తులుంటూ అలా గడుపుతున్న క్రమంలో రెహమాన్‌లో ఉన్న టాలెంట్‌ను గుర్తించింది అతని తల్లి.
మన కష్టాలు ఎప్పుడూ ఉండేవేనని..సంగీతం మీద దృష్టి పెట్టమని సలహా ఇస్తూ.. తన దగ్గరున్న కాస్త బంగారం ఇచ్చి ప్రోత్సహించింది. అప్పట్లో దూర దర్శన్ లో ‘వండర్ బెలూన్ ‘అని ఒక ప్రోగ్రాం వచ్చింది అందులో ఒక వ్యక్తి ఒకేసారి నాలుగు కీబోర్డ్స్ ప్లే చేసాడు .. అప్పుడే గొప్ప సంగీత దర్శకుడు అవుతాడని అతనూ ఊహించి ఉండడు. అలా ఎదిగే క్రమంలో ఇంకా సినిమాల్లోకి రాకముందే.. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ‘అక్షరమాల’ ప్రోగ్రాం కి సంగీతం అందించాడా కుర్రాడు. బాపుగారి దర్శకత్వంలో రూపొందిన ప్రోగ్రాం అది. ఆ తర్వాత మణిరత్నం చెల్లెలు చేసే వాణిజ్య ప్రకటనలకి సంగీతం అందించడం వల్ల మణిరత్నం తో పరిచయం అయి ‘రోజా’ సినిమాకి సంగీతం అందించే అవకాశం వచ్చింది.
రెండు ఆస్కార్ అవార్డులు, రెండు గ్రామీ పురస్కారాలు, ఒక బిఎఎఫ్‌టిఎ పురస్కారం, ఒక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం , నాలుగు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, పదిహేను ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, పదమూడు ఫిల్మ్ ఫేర్ సౌత్ పురస్కారాలు రెహమాన్ ఖాతాలో ఉన్నాయి. రెహ్మాన్ అంటే నాకు భయం, జలసీ అని స్వయంగా ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు ఎస్ ఎల్ వైద్యనాథన్ అన్నాడంటే.. రెహమాన్ గొప్పతనమేంటో, అతడి టాలెంట్ ఏంటో అర్ధమవుతోంది. రెహమాన్ గౌరవార్ధం కెనడా లోని ఒంటారియో రాష్ట్రంలోని ఒక వీధికి రెహమాన్ పేరు పెట్టారు అక్కడి వారు.
ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే రెహమాన్.. జీవితం కష్టపడి ఎదగాలనుకునేవాళ్ళకి ఒక పాఠం. ఇవాళ అతను మనకి నచ్చే సంగీతం అందించడం లేదని మనం గొడవచెయ్యచ్చు కానీ ఒకప్పుడు అందరం అతని సంగీతాన్ని ఎంజాయ్ చేశాం. నాకు అతని సంగీతం లో చాలా పాటలు ఇష్టం కానీ మొదటగా నచ్చేది “అమృత” సినిమాలో బాలూ పాడిన “ఏ దేవి వరమో నీవు”.. మరి మీకేదిష్టం.