Special article on internal conflict in Pakistan
mictv telugu

మూడు ముక్కలు కానున్న పాకిస్తాన్!.. తాలిబన్ వీడియో వైరల్

January 5, 2023

దాయాది దేశం పాకిస్తాన్‌లో పరిస్థితులు విషమిస్తున్నాయి. ఆర్ధిక సంక్షోభం, తీవ్ర ద్రవ్యోల్బణంతో ఓవైపు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే పులి మీద పుట్రలాగా తెహ్రీక్ ఎ తాలిబన్, బలూచ్ ఆర్మీలు ఆర్మీపై వరుస దాడులకు దిగుతున్నాయి. ఇక ఇమ్రాన్ ఖాన్ సంగతి సరేసరి. విద్వేష ప్రసంగాలతో ప్రజలను రెచ్చగొడుతూ భారీ ర్యాలీలతో ఒత్తిడి పెంచుతున్నాడు. ఈ నేపథ్యంలో చాలా మంది అంతర్జాతీయ విశ్లేషకుల అంచనా ప్రకారం పాకిస్తాన్ త్వరలో మూడు ముక్కలవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

బలూచ్ లిబరేషన్ ఆర్మీ


గత కొంతకాలంగా దేశంలోనే అతిపెద్ద ప్రావిన్స్ – అతి తక్కువ జనాభాతో పాటు వనరులు ఎక్కువగా ఉన్న బలూచిస్తాన్ ప్రత్యేక దేశం కోసం పోరాటం చేస్తోంది. తమ ప్రాంతంలో ఉన్న సహజవనరులను పాకిస్తాన్ కొల్లగొడుతోందని, తమను మాత్రం పనికిరాని వారిగా చిత్రీకరిస్తూ అభివృద్ధికి దూరం పెడుతోందని బలూచీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఎవరు నిరసన తెలిపినా వారిని కిడ్నాప్ చేసి గుర్తు తెలియని ప్రాంతాలకు తీసుకెళ్లి హతమార్చడంతో బలూచిస్తాన్‌లో అదృష్యమైన వారి సంఖ్య వేలకు చేరింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బలూచీలు గెరిల్లా యుద్ధానికి దిగారు. ఏకంగా పాక్ ఆర్మీని టార్గెట్ చేస్తూ విపరీతంగా దాడులు చేస్తున్నారు. అంతేకాక, సీపెక్‌లో భాగంగా తమ ప్రాంతంలో గ్వాదర్ పోర్టును నిర్మిస్తున్న చైనీయులే లక్ష్యంగా బాంబు దాడులకు తెగబడి ప్రాణాలు తీస్తున్నారు. వీరికి మనదేశంతో పాటే స్వాతంత్ర్యం వచ్చినా, 1948లో పాక్ దాడి చేసి బలూచిస్తాన్‌ని తనలో కలిపేసుకుంది. బలూచ్ రాజు భారత్‌లో కలుస్తానని చెప్పినా పాక్ అతడిని కిడ్నాప్ చేసి బలవంతంగా విలీనంపై సంతకాలు చేయించుకుంది. చరిత్ర ఇలా ఉండగా, గతంలో తమ ప్రయోజనాల కోసం ఆందోళన చేస్తున్న ఆందోళన కారులపై పాక్ ప్రభుత్వం ఆర్మీని ప్రయోగించి కఠినంగా అణచివేసింది. సొంత ప్రజలపైనే ఆర్మీ దాడి చేయడంతో బలూచీలు చావోరేవో అనే పరిస్థితికి వచ్చారు. వీరికి సరిహద్దు నుంచి ఇరాన్ మద్ధతు కొంతవరకు లభించడం సానుకూలాంశం అయితే ప్రధాని మోదీ బలూచీలకు అండగా నిలబడతామని చెప్పడం వీరికి కొండంత అండగా మారింది. దీంతో తమ పోరాటాన్ని తీవ్రతరం చేస్తున్నారు.

 

ఖైబర్ పఖ్తుంఖ్వా


ఈ ప్రాంతం చరిత్రలోకి వెళ్తే దేశ విభజన సమయంలో ఈ ప్రాంతం భారత్‌తో కలిసి ఉంటామని అసెంబ్లీలో తీర్మానం చేశారు. సరిహద్దు గాంధీగా పేరుపొందిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ వీరి ముఖ్య నాయకుడు. పాకిస్తాన్‌లో కలవబోమని చెప్పినా అప్పటి బ్రిటీష్ వారు భారత్ – రష్యాల మధ్య సంబంధాల దృష్ట్యా పాకిస్తాన్‌లో కలిపేశారు. వీరు కూడా కనీస అవసరాలకు, అభివృద్ధికి నోచుకోలేదు. పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతం వారి పెత్తనం ఎక్కువ ఉండడంతో వీరు కూడా చిన్నచూపుకు గురయ్యారు. ఇప్పుడు టెర్రర్ పుట్టిస్తున్న తెహ్రీక్ ఎ తాలిబన్ సంస్థకు ఈ ప్రాంతంలో గట్టి పట్టుంది. పాకిస్తాన్ ప్రస్తుతం ఆర్దిక, రాజకీయ సంక్షోభంలో ఉండడంతో ప్రత్యేక దేశం లేదా ఇస్లామాబాద్‌లో పార్లమెంటును హస్తగతం చేసుకోవడంపై దృష్టిపెట్టింది. పఠాన్లు, పష్తూన్లు అని పిలిచే ఈ ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్‌తో సరిహద్దును పంచుకుంటోంది. దీంతో వీరికి ఆఫ్ఘన్ తాలిబాన్ల మద్దతు కూడా లభిస్తోంది. ఇక బుధవారం టీటీపీ ఓ వీడియో రిలీజ్ చేయడం సంచలనంగా మారింది. ఇస్లామాబాద్‌లోని పాకిస్తాన్ పార్లమెంటును చూపిస్తూ ఓ చీటీ మీద ‘మేము వస్తున్నాం’ అని ఇంగ్లీష్, ఉర్దూలో రాసి ఉన్న వీడియోను రిలీజ్ చేశారు. అంటే పార్లమెంటును ఆక్రమించనున్నారని అర్ధం వచ్చేలా ఉన్న వీడియోలో ఆ వ్యక్తి ముఖం మాత్రం కనిపించడం లేదు. దీంతో అంతర్గత పోరు పతాక స్థాయికి చేరినట్టయింది.

ఇక హిందువులు చెప్పుకోదగ్గ సంఖ్యలో నివసించే సింధ్ ప్రాంతం కూడా అప్పుడప్పుడు ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేస్తోంది. ఇప్పటివరకు సాయుధ దాడులు చేయకపోయినా పౌర ఆందోళనలు నిర్వహించింది. పాకిస్తాన్ నేడు ఉన్న పరిస్థితుల్లో భారత్ ఎప్పటినుంచో కావాలని కోరుకుంటున్న ఆక్రమిత కశ్మీర్‌ని తిరిగి చేజిక్కించుకోవడానికి ఇదే సరైన సమయమనే చర్చ నడుస్తోంది. ఈ సమయంలో కనుక భారత్ దాడులకు తెగబడితే పీవోకేను తన చేతులతో అప్పగించే పరిస్థితులు పాకిస్తాన్‌లో ఉన్నాయని చెప్తున్నారు. ఇక చైనా అడ్డంకి విషయానికి వస్తే తైవాన్‌ని అడ్డం పెట్టవచ్చు. మీరు తైవాన్‌ని ఆక్రమించుకుంటే మేం పీవోకేను ఆక్రమించుకుంటాం.. మీరు మాకు అడ్డు రావద్దు మేము మీకు అడ్డు రాము అని భారత్ ఇప్పటికే చైనాతో ఓ రహస్య ఒప్పందం కుదుర్చుకున్నట్టు పాక్ అనుమానిస్తోంది. ఇదే జరిగితే పీవోకేను స్వాధీనం చేసుకోవడానికి మనకు అడ్డే ఉండదని విశ్లేషకులు చెప్పే మాట. మరి ఇన్ని కష్టాలను తట్టుకుని పాకిస్తాన్ నిలబడగలదా? లేక ఇన్ని ప్రాంతాలను పొగొట్టుకొని కేవలం పంజాబ్‌ మాత్రమే మిగులుతుందా? అన్నది చూడాల్సి ఉంది.
సేకరణ, రచన : రవీందర్ నాయక్