అక్ర‌మాస్తుల కేసులో మాజీ ముఖ్యమంత్రికి నాలుగేళ్ల జైలు శిక్ష - MicTv.in - Telugu News
mictv telugu

అక్ర‌మాస్తుల కేసులో మాజీ ముఖ్యమంత్రికి నాలుగేళ్ల జైలు శిక్ష

May 27, 2022

అక్ర‌మాస్తుల కేసులో హ‌ర్యానా మాజీ సీఎం ఓం ప్ర‌కాశ్ చౌతాలా దోషిగా తేలారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని నిర్ధారణ కావడంతో ఢిల్లీకి చెందిన సీబీఐ కోర్టు.. నాలుగేళ్ల జైలుశిక్ష‌ను ఖ‌రారు చేసింది. ఆయ‌న‌కు 50 ల‌క్ష‌ల జ‌రిమానా కూడా విధించింది. చౌతాలాకు చెందిన నాలుగు ఆస్తులను జప్తు చేయాలని కూడా ఆదేశించింది. విచార‌ణ సంద‌ర్భంగా కోర్టురూమ్‌కు ప్ర‌త్యక్షంగా చౌతాలా హాజ‌ర‌య్యారు. అక్ర‌మాస్తుల కేసులో స్పెష‌ల్ జ‌డ్జి వికాశ్ దుల్ గ‌త వార‌మే తీర్పునిస్తూ చౌతాలాను దోషిగా తేల్చారు. 1993 నుంచి 2006 మ‌ధ్య ఆదాయానికి మించి ఆస్తుల‌ను క‌లిగి ఉన్న కేసులో చౌతాలాను విచారించారు.

సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం.. 1999, జులై 24- 2005, మార్చి 5 మధ్య హరియాణా సీఎంగా చౌతాలా పనిచేసిన సమయంలో అక్రమంగా ఆస్తులు కూడబెట్టారు. చౌతాలా, ఆయన కుటుంబసభ్యుల పేరుమీద మొత్తం రూ.1467 కోట్ల మేర ఆస్తులున్నట్లు గుర్తించిన సీబీఐ… మొత్తంగా చౌతాలాకు రూ.6.9 కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్లు లెక్కించింది. నగదు, నగలు కాకుండా.. 43 స్థిరాస్తులు పోగుచేసినట్లు సీబీఐ వెల్లడించింది. 2005లో చౌతాలాపై సీబీఐ కేసు నమోదు చేసింది. 2010, మార్చి 26న ఛార్జి షీట్ దాఖలు చేసింది.