వృద్ధులు, వికలాంగులు, వితంతవుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా వితంతవుల కోసం ఫించన్ నిబంధనలను సర్కారు సులభతరం చేసింది. భర్త చనిపోయిన స్త్రీ(ఆయన భార్య)కు వెంటనే ఆసరా పింఛన్ అందేలా ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దురదృష్టవశాత్తూ వృద్ధాప్య పింఛను పొందుతున్న వ్యక్తి చనిపోతే .. ఆయన భార్యకు వెంటనే ఆసరా పింఛను మంజూరు చేయాలని అధికారులకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో సందీప్‌కుమార్ సుల్తానియా ఆదేశాలు జారీ చేశారు.
ఫించను కోసం సదరు మహిళలు.. వారి ఆధార్ కార్డు(జిరాక్స్)తో పాటు, వారి భర్త(మృతుడి) డెత్ సర్టిఫికెట్‌ను సంబంధిత అధికారులకు సమర్పించాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పంచాయతీ కార్యదర్శికి , పట్టణాల్లో అయితే బిల్ కలెక్టర్‌కు ఆ రెండు సర్టిఫికెట్(జిరాక్స్)లను సమర్పించాలని సూచించారు. ఈ రెండు డాక్యుమెంట్లను తీసుకొని, ఆ వివరాలను ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్‌కు పంపించాలని తెలిపారు. వీటి కోసం ఆసరా పోర్టల్‌లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామని వివరించారు.
ఆ తర్వాత కలెక్టర్, డీఆర్డీవో ఆమోదానికి ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను పంపించాలని సూచించారు. వృద్ధాప్య పింఛను పొందుతున్న వ్యక్తి చనిపోయిన 15 రోజుల్లో ఈ వివరాలను నమోదు చేయాలని పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ బిల్ కలెక్టర్లను ఆదేశించారు. ఇతర డాక్యుమెంట్లు ఏవీ అడగొద్దని ఆదేశించారు. వృద్ధాప్యంలో ఉన్న వారికి పింఛన్ ఎంతో ఆసరాగా నిలుస్తున్నదని, ఇంటి పెద్ద చనిపోతే కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇక్కట్ల పాలు కావద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొన్నదని వివరించారు.