ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రత్యేక పోర్టల్: యూజీసీ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రత్యేక పోర్టల్: యూజీసీ

May 14, 2022

దేశవ్యాప్తంగా ఆయా సెంట్రల్ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి, యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ జగదీశ్ కుమార్ కీలక విషయాలను తెలియజేశారు. త్వరలోనే ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తామని ఆయన తెలిపారు. జగదీశ్ కుమార్ మాట్లాడుతూ..”సెంట్రల్ వర్సిటీల్లో ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేందుకు ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి తీసుకొస్తున్నాం. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో 35 శాతం ఖాళీలు ఉన్నాయి. వాటిని వీలైనంత త్వరగా నింపుతాం. దరఖాస్తులను కేంద్రీకృత పద్ధతిలో స్వీకరించినా, భర్తీ మాత్రం వర్సిటీలవారీగానే ఉంటుంది. పోర్టల్‌లో వర్సిటీల వారీగా ఖాళీల వివరాలు ఉంటాయి. నోటిఫికేషన్ వెలువడగానే ఆటో ఈ మెయిల్ ద్వారా అభ్యర్థులకు సమాచారం అందుతుంది. అభ్యర్థులు తమ అర్హతల మేరకు ఒకటి లేదా రెండు మూడు యూనివర్సిటీలకు ఒకేసారి దరఖాస్తు చేసుకోవచ్చు” అని ఆయన అన్నారు.

మరోపక్క తెలంగాణ రాష్ట్రంలో ఆయా యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల విషయంలో గతకొన్ని రోజుల క్రితం కేసీఆర్ మాట్లాడుతూ..”తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలలో మొత్తం మూడున్నర వేలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలను ఎవరికి వాళ్లే భర్తీ చేయటంలో కొన్ని రకాల ఇబ్బందులు, కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. వేరే రాష్ట్రాలను పరిశీలించినప్పుడు ఒక కామన్ బోర్డ్ విద్యాశాఖ ఆధ్వర్యంలో పెట్టి, రిక్రూట్‌మెంట్ చేసి ఏ యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ఎంతవరకు అవసరమో తెప్పించుకోని, ఆ ప్రకారం పుల్‌ఫిల్ చేస్తారు. లేకపోతే పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా గాని, ఇతర మెకానిజం ద్వారా గాని ఆ రిక్రూట్‌మెంట్ ద్వారా ఆయా శాఖలకు కావాల్సిన ఉద్యోగులను అలర్ట్ చేస్తారు. ఆ రకంగానే తెలంగాణలో కూడా ఏ ఇబ్బంది లేకుండా అవి జరిగిపోతాయి” అని ఆయన అన్నారు.