ఆదానీ ఓడరేవును కేరళీయులు ఎందుకు అడ్డుకుంటున్నారు? - MicTv.in - Telugu News
mictv telugu

ఆదానీ ఓడరేవును కేరళీయులు ఎందుకు అడ్డుకుంటున్నారు?

November 28, 2022

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన గౌతమ్ ఆదానీ సారథ్యంలోని ఆదానీ గ్రూప్ కేరళలో నిర్మిస్తున్న భారీ ఓడరేవుపై తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. నిరసలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు పోలీస్ట్ స్టేషన్‌పై దాడి చేసి పలువురు కానిస్టేబుళ్లను గాయపర్చారు. పోలీసులు ఏకంగా మూడువేల మందిపై కేసులు పెట్టారు. నిరసనల్లో కేథలిక్ క్రైస్తవ మతోబోధకులు కూడా పాల్గొనడం, సారథ్యం వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వేల కోట్ల పెట్టుబడులతో నిర్మిస్తున్న ఆదానీ పోర్టును కేరళీయులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వారికి మతాలకు అతీతంగా భారీ మద్దతు రావడానికి కారణమేంటి? కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నుంచి పుష్కలంగా అండదండలున్న ఆదానీ ఈ నిరసనలు ఎలా ఎదుర్కొంటారు? ఎలా ‘మేనేజ్’ చేసి ప్రాజెక్టును పూర్తి చేస్తారు?

పొట్ట కొట్టొద్దు..

కేరళ రాజధాని తిరువనంతపురానికి 16 కి.మీ. దూరంలోని విలింజంలో రూ. 7,345 కోట్లతో ఆదానీ పోర్టు నిర్మిస్తున్నారు. పోర్టు నుంచి శ్రీలంక, దుబాయ్, సింగపూర్‌లకు భారీ స్థాయిలో సరుకు రవాణా జరపాలన్నది లక్ష్యం. ఇది దేశంలోనే తొలి ‘మెగా ట్రాన్స్‌షిప్‌మెంట్ కంటైనర్ టర్మినల్’ అని అంటోంది ఆదానీ గ్రూప్. 2015 నుంచి పనులు మొదలయ్యాయి. అయితే ఇది పర్యావరణానికి, ప్రజల బతుకు తెరువుకు గొడ్డలిపెట్టని విమర్శలు వస్తున్నాయి. పోర్టు పనుల్లో భాగంగా తీరంలో నిర్మిస్తున్న కృత్రిమ నిర్మాణాలు తీరానికి ముప్పు కలిగాయని అంటున్నారు. పోర్టు పనుల ఇప్పటికే తీరప్రాంతం భారీ విస్తీర్ణంలో కోతకు గురైందని, జాలర్ల జీవనోపాధి దెబ్బతిందని బాధితులు చెబుతున్నారు. ‘‘పోర్టు పనుల వల్ల అలలు విరుచుకుపడి 500 ఇళ్లు, పడవలు కోల్పోయాం. మాకు పరిహారం ఇప్పించండి’’ అని జాలర్లు కోరుతున్నారు. మూడు నెలల కిందట స్థానికుల ఆందోళనతో పనులు ఆగాయి. కోర్టులో కేసు కూడా నడుస్తోంది. కోర్టు ఆదేశాలతో శనివారం నుంచి మళ్లీ పనులు ప్రారంభయ్యాయి. 25 భారీ ట్రక్కులు రాగా ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. అయితే చట్టాలను ఉల్లంఘించకుండా పోర్టు నిర్మిస్తున్నామని కంపెనీ చెబుతోంది. రాష్ట్రంలోని కమ్యూనిస్టుల ప్రభుత్వం కూడా వత్తాసు పలుకుతున్నట్లు కనిపిస్తోంది. తీర ప్రాంతం కోతకు గురికావడానికి పోర్టు పనులు కారణం కాదని, ప్రకృతి విపత్తుల వల్లే తీరం కోసుకుపోయిందని చెబుతోంది.

మతబోధకుల మద్దతు

ఈ ప్రాంతంలో కేథలిక్ మతబోధకుల ప్రభావం ఎక్కువ. పోర్టు వల్ల నష్టపోయిన, భవిష్యత్తుల్లో నష్టపోయే వారిలో అత్యధికం క్రైస్తవులే. అండగా పాస్టర్లు, నన్‌లు నిరసనల్లో పాల్గొంటున్నారు. పోలీసులు వారిపైనా కేసులు పెట్టారు. లాటిన్ కేథలిక్ చర్చి ఆధ్వర్యంలోనే నిరసనకారులు స్థానిక పోలీస్ స్టేషన్ పై దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆదానీ గ్రూప్, కేరళ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఎలాగైనా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఆదానీ గ్రూప్ ‘అన్ని అనుమతులు’ తెచ్చుకున్నామని, పోర్టు వల్ల దేశానికి మేలే జరుగుతోందని అంటోంది.