పూర్తిగా మారిపోతున్న తెలంగాణ వైద్య విద్య ముఖ చిత్రం - MicTv.in - Telugu News
mictv telugu

పూర్తిగా మారిపోతున్న తెలంగాణ వైద్య విద్య ముఖ చిత్రం

November 15, 2022

వైద్యవిద్యారంగంలో తెలంగాణ ప్రభుత్వం ఓ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 8 మెడికల్ కాలేజీలలో మంగళవారం నుంచి క్లాసులు ప్రారంభం కాబోతున్నాయి. ఇలా జరగడం రాష్ట్ర, దేశ చరిత్రలోనే అరుదైన ఘట్టంగా భావిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేనాటికి కేవలం 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండగా, ఇప్పుడు ఏకంగా 8 కాలేజీలు కొత్తగా ప్రారంభం కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటికే నిజాం కాలంలో కట్టిన ఉస్మానియా, గాంధీలు వైద్యకళాశాలలు అందుబాటులో ఉండేవి. తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఆరు దశాబ్దాలలో కేవలం 3 మెడికల్ కాలేజీలు మాత్రమే ఏర్పాటయ్యాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం 2014లో ఆవిర్భవించాక రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఫేజ్ లో మహబూబ్‌ నగర్‌, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట్‌లో 4 మెడిల్‌ కాలేజీలు ఏర్పాటు చేసింది. ఇక రెండో దశలో మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, నాగర్‌ కర్నూల్‌, మహబూబాబాద్‌, సంగారెడ్డిలో కాలేజీలను ఏర్పాటు చేసింది. దీంతో మెడికల్ కాలేజీల సంఖ్య 17కి చేరింది. కొత్తగా ఏర్పాటైన ఈ 8 కాలేజీల్లో ఇవాళ్టినుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది 9, ఆ తర్వాత వచ్చే ఏడాది మరో 8 మెడికల్‌ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటుచేయనున్నది. దీంతో జిల్లాకో మెడికల్‌ కాలేజీ కల సాకారం అవనుంది. ఇప్పుడు ఏర్పాటు చేసిన కొత్త కాలేజీలతో రాష్ట్రంలో అదనంగా 1,150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి.

2014లో కేవలం 850గా ఉన్న ఎంబీబీఎస్‌ సీట్లు ఇప్పుడు 2,790 కి పెరిగాయి. పీజీ సీట్లు 531 నుండి 1122 కి, సూపర్‌ స్పెషాలిటీ సీట్లు 76 నుండి 152కి పెరిగాయి. కొత్త మెడిక‌ల్ కాలేజీల‌తో ప్రజ‌ల‌కు నాణ్యమైన వైద్యం అందనుంది. ఇందులో మొత్తం 35 వైద్య విభాగాలు సేవ‌లందిస్తాయి. అత్యాధునిక వైద్య ప‌రిక‌రాలు, ల్యాబ్స్ ఉంటాయి. 449 మంది డాక్టర్లు అందుబాటులో ఉంటారు. 600 పైగా పారామెడిక‌ల్ సిబ్బంది సేవలు అందించనున్నారు. పెద్ద పెద్ద వ్యాధులు వచ్చిన ప్రతిసారి హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరంలేకుండా.. ప్రజలు ఇకనుంచి తమ సమీపంలోని ఈ మెడికల్ కాలేజీలకు వెళ్లి నాణ్యమైన వైద్యం పొందే అవకాశం ఉంది. మరోవైపు కొత్త మెడిక‌ల్ కాలేజీల ఏర్పాటుతో విద్యార్థులు స్థానికంగా చదువుకునే అవకాశాలు లభించనుంది. తెలంగాణ వచ్చాక ఈ రంగంలో కేసీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బడుగు, బలహీనవర్గాలకు మేలు చేకూరేలా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ దెబ్బతో మెడికోల సంఖ్య పెరగడంతో పాటు నాణ్యమైన వైద్యం అందనుంది. నేను రాను బిడ్డో సర్కారు దావఖానకు అనే పాపులర్ తెలంగాణ నానుడిని పటాపంచలు చేస్తూ రాష్ట్రం నలువైపులా మెడికల్ కాలేజీలను స్థాపించి తద్వారా ఆరోగ్య రంగంలో తెలంగాణను అగ్రస్థానానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలోని బలమైన బీజేపీ ప్రభుత్వం ఒక్క కాలేజీ కూడా మంజూరు చేయకున్నా మొక్కవోని ధైర్యంతో కేసీఆర్ ముందడుగు వేస్తున్నారు.