Special story on trs Brs party on the eve of first public meeting
mictv telugu

బీఆర్ఎస్ ఆవిర్భావం వెనక.. ప్రాంతీయం నుంచి జాతీయం దాకా..

January 18, 2023

Special story on trs Brs party on the eve of first public meeting

భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) తొలి బహిరంగ సభ ఖమ్మంలో అట్టహాసంగా జరుగుతోంది. వేలమంది హాజరైన ఈ సభ నుంచి దళపతి కేసీఆర్ దేశానికి విస్పష్టం సందేశం ఇవ్వబోతున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ తప్ప దేశానికి మరో దిక్కులేదనే అపోహను బద్దలు కొట్టబోతున్నారు. ముగ్గురు ముఖ్యమంత్రులతో, ఒక మాజీ సీఎంతో కలసి గులాబీ జెండాల రెపరెపల మధ్య దేశానికి కొత్త రాజకీయాన్ని పరిచయం చేస్తున్నారు. ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు కేజ్రీవాల్, భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌ల సమక్షంలో జరుగుతున్న ఈ సభ దేశంలో బీఆర్ఎస్ ఎలాంటి పాత్ర పోషించనుందో ప్రతీకాత్మకంగా చెప్పకనే చెబుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌ గతం, వర్తమానం, భవిష్యత్తుపై ఫోకస్..

ఆత్మగౌరవం, సంక్షేమం

నీళ్లు, నిధులు, నియామకాల డిమాండు కేవలం ప్రత్యేక రాష్ట్ర సాధనతోనే సాధ్యమవుతుందంటూ కేసీఆర్ 2001 ఏప్రిల్లో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)ను స్థాపించారు. ఉమ్మడి పాలనలో ఆత్మగౌరవానికి, సరైన విద్య, ఉపాధి అవకాశాలకు నోచుకోని తెలంగాణ తరఫున భీకరంగా కొట్లాడి అనుకున్నది సాధించారు. కలసివచ్చే అన్ని శక్తులను కలుపుకుపోయారు. కాంగ్రెస్‌తో తీవ్ర విభేదాలున్నా ఎప్పటికి ఏది మేలో గమనిస్తూ కేంద్రంలో మంత్రి పదవి కూడా చేపట్టి ఆనాడే దేశం దృష్టిని ఆకర్షించారు. 2014లో తెలంగాణ సిద్ధించాక తను చెప్పుకుంటున్నట్టు కనీవినీ ఎరుగని అభివృద్ధి, సంక్షేమ ప్రాజెక్టులను, పథకాలను అమలు చేస్తూ రెండోసారి అధికారంలోకి వచ్చారు. వ్యవసాయం, ఐటీ, విద్య, వైద్యం వంటి అనేకరంగాల్లో తెలంగాణను అగ్రగామిగా నిలిపారు. రైతుబంధు, రైతుబీమా, సాగుకు ఉచిత విద్యత్తు, దళితబంధు వంటి ఎన్నో పథకాలతో దేశం దృష్టిని ఆకర్షించారు.

టార్గెట్ ఢిల్లీ.. సమాఖ్య మంత్రం

జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మూడో ప్రత్యామ్నాయం కోసం జరిగిన ప్రయత్నాలు సరైన ఫలితాలివ్వలేదు. నేషనల్ ఫ్రంట్ మూణ్నాళ్ల ముచ్చటే అయింది. నానా అజెండాలున్న ప్రాంతీయ పార్టీలను ఒక వేదికపైకి తీసుకురావడం భగీరథ ప్రయత్నమే. బీజేపీ, కాంగ్రెస్‌లలో ఏదో ఒకదానితో అంటకాగే ప్రాంతీయ పార్టీలు గోడమీది పిల్లుల్లా ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చెప్పడం కష్టం. గుడ్డిలో మెల్లగా ఆప్ పార్టీ దీనికి కొంత మినహాయింపు. కమ్యూనిస్టులు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో జట్టుకడతారు. మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, నవీన్ పట్నాయక్‌లది మరో ధోరణి. ఇలా ఎవరికి వారుగా ఉన్న ‘మూడో ప్రత్యామ్నాయ’ నేతలను ఒక తాటిపైకి తీసుకురావడం కష్టమే అయినా అసాధ్యం కాదని కేసీఆర్ రంగంలోకి దూకారు. తెలంగాణలో తన ప్రభుత్వం సాధించిన విజయాలే ప్రధాన శక్తిగా భావించి కలసివచ్చే శక్తులతో యుద్ధరంగంలోకి దూకారు.

సరైన సమయంలో..

నోట్ల రద్దు, పెచ్చరిల్లిన మతోన్మాదం, పేదరికం, నిరుద్యోగంతో దేశం సంక్షోభంలో చిక్కుకున్న దశలో, విపక్ష కాంగ్రెస్ కొనఊపిరితో కొట్టుకుంటున్న స్థితిలో కేసీఆర్ టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చారు. ఒక ప్రాంతీయ పార్టీని దిగ్గజ జాతీయ పార్టీల సరసన నిలబెట్టారు. సీపీఎం, ఆప్, సమాజ్‌వాదీ, జేడీఎస్ మాత్రమే ప్రస్తుతానికి ఆయనతో చేతులు కలిపినా రానున్న కాలంలో మరిన్ని ప్రాంతీయ, లౌకిక పార్టీలు కలిసే అవకాశం కనిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో విలువలు, నీతినిజాయతీలతో సంబంధం లేకుండా అంకెలే అధికారాన్ని నిర్ణయిస్తాయి. బీజేపీ, కాంగ్రెస్‌లతో పోలిస్తే ప్రాంతీయ పార్టీల, బీఆర్ఎస్ వంటి కొత్త, పాత జాతీయ పార్టీల బలం తక్కువే కావచ్చుగాని అవకాశం కలిసివస్తే అధికారం నల్లేరుపై బండినడకే. ’బీఆర్ఎస్ కూటమి’ అని ఇప్పటికప్పుడు చెప్పుకోవడం అతిశయోక్తిగా అనిపించినా రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు. వచ్చే ఎన్నికల్లో ఈ కూటమిలోని పార్టీలకు, కూటమితో జట్టుకట్టే అవకాశమున్న పార్టీలకు వందసీట్లు దక్కినా ఢిల్లీ గద్దె ఎవరితో నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించడం ఖాయం. పెద్ద పార్టీలు నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయి ప్రత్యర్థులకు గద్దె దక్కకూడదని ఈ కూటమికి మద్దతిస్తే సీఎం కేసీఆర్ పీఎం కేసీఆర్ కావడంతో వింతేమీ కాబోదు!!