కేంద్రం ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. లీటర్ పెట్రోల్ పై రూ.8, డీజిల్ పై రూ.6 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో లీటర్ పెట్రోల్ ధరపై రూ.9.50, డీజిల్‌పై రూ.7 మేర తగ్గింది. దీంతో సామాన్యడికి పెట్రోల్ , డీజిల్ ధరల నుంచి ఊరట లభించిందనే వార్తలు వస్తున్నాయి. కానీ ఇది కొంతవరకే నిజం. ఎందుకంటే బీజేపీ అధికారంలోకి రాకముందు అంటే అప్పటి కాంగ్రెస్ పాలనలో పెట్రో ఉత్పత్తులపై కేంద్రం విధించిన పన్నులతో పోలిస్తే మోడీ సర్కార్ తాజాగా చేసింది కేవలం కంటి తుడుపు చర్య మాత్రమే. మార్చి 2014 లో అంటే బీజేపీ అధికారంలోకి రాకముందు డీజిల్‌పై కేంద్ర పన్ను లీటరుకు రూ.3.46 కాగా, నవంబర్ 2021 నాటికి లీటరుకు రూ.31.8 ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అదే విధంగా పెట్రోల్ లీటరుకు రూ.9.2 కాగా, నవంబర్ 2021 నాటికి రూ. 32.9కి చేరుకుంది.
ఇక బీజేపీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఈ ఎనిమిదేండ్లలో పెట్రోల్, డీజిల్‌పై పన్నుల రూపంలో ప్రజల నుంచి రూ.26 లక్షల కోట్లకుపైగా వసూలు చేసింది. ఒక్క 2021 సంవత్సరంలోనే ఏకంగా రూ.3.7 లక్షకోట్లు కేంద్ర ఖజానాకు చేరాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరిగి లీటర్ పెట్రోల్ రూ.120కి చేరటంతో కేంద్రానికి దాదాపు రూ. 4 లక్షల కోట్ల ఆదాయం రావచ్చని ముందస్తు అంచనాలున్నాయి. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ తాజా తగ్గింపు వల్ల కేంద్రప్రభుత్వం ఏటా రూ.లక్ష కోట్ల ఆదాయం కోల్పోనున్నదని నిర్మలాసీతారామన్ ఆవేదన వ్యక్తంచేశారు. కానీ, ఇప్పుడు ఎక్సైజ్ డ్యూ టీ తగ్గింపువల్ల అందులో మొత్తం రూ.4 లక్షల కోట్లలో కేంద్రం కోల్పోతున్న ఆదాయం రూ.లక్ష కోట్లు మాత్రమే. ఎలా చూసినా కేంద్రానికి ఇంకా రూ.3 లక్షల కోట్ల ఆదాయం మిగులుతుంది. మరోవైపు రాష్ట్రాలు(ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు) సైతం పెట్రోల్/డీజిల్‌పై స్థానిక పన్నులు/ వ్యాట్‌ను తగ్గించాలని నిర్మలా అభ్యర్థించారు. నవంబరులో కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినా.. ఆ మేరకు పన్నులను తగ్గించని రాష్ట్రాలకు ఈసారి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలు ఇంకా సామాన్యుడిని బెంబేలెత్తించే స్థాయిలోనే ఉండనున్నాయి. హైదరాబాద్‌లో శనివారం లీటర్ పెట్రోల్ రూ.119.49, డీజిల్ రూ.105.49 ఉన్నది. తాజా తగ్గింపుతో ఆదివారం నుంచి లీటర్ పెట్రోల్ రూ.110, లీటర్ డీజిల్ రూ.99.49 ఉండనున్నది. ఎనిమిదేండ్ల క్రితం బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికంటే తాజా రేట్లు భారీగానే ఉన్నాయి. ఈ ధరల తగ్గింపును కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌సింగ్ సూర్జేవాలా విమర్శించారు. గత 60 రోజుల్లో లీటర్ పెట్రోల్‌పై రూ.10 పెంచి రూ.9.50 తగ్గిస్తున్నట్లు ప్రకటించారని, డీజిల్‌పై రూ.10 పెంచి ఇప్పుడు రూ.7 తగ్గిస్తున్నట్లు చెప్పారు.