అతివేగం ప్రమాదకరం.. ఈ నినాదాన్ని ఎన్నో సార్లు విన్నాం, పాటించకపోవడం వల్ల జరిగే అనర్ధాలను కూడా చూశాం. రోడ్డు ప్రయాణంలో జాగ్రత్త వహించకపోతే మనకు, మన కుటుంబానికి జరిగే నష్టాన్ని ఊహించలేం. ఇవన్నీ తెలిసి కూడా మనం వేగంగా వెళ్తున్నామంటే… తప్పు మనదే. ఖాళీ రోడ్డుపై జరిగిన ఓ ప్రమాదానికి సంబంధించిన పాత వీడియో సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది.
వీడియోలో ఓ ట్రాక్టర్ కూలీలతో… మెయిన్ రోడ్డుపైకి వస్తుండగా.. అదే సమయంలో మరో మార్గం నుంచి ఓ కారు వస్తుంటుంది. దాన్ని చూసిన ట్రాక్టర్ డ్రైవర్… ఆగు ఆగు అంటూ తన చేత్తో సైగలు చేస్తూనే ఉన్నాడు. కానీ ఆ కారు డ్రైవర్ పట్టించుకోకుండా అతి వేగంతో ట్రాక్టర్ని ఢీకొట్టాడు. దాంతో… ట్రాక్టర్ ఇంజిన్ భాగం ముక్కలైపోయింది. డ్రైవర్ సీట్ భాగం అలాగే ఉంది. ఈ ఘోర ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ గాయాలేవీ అవ్వకుండా బయటపడ్డాడు. అతను బయటపడిన విధానం చూస్తే ఆశ్చర్యపోకమానరు.
ఈ వీడియోని ఏప్రిల్ 30, 2022న ఇన్‌స్టాగ్రామ్‌లోని ఓ పేజీలో పోస్ట్ చేశారు. దీన్ని ఇప్పటివరకు లక్షల మంది చూడగా… 1.22 లక్షల మందికి పైగా లైక్ చేశారు. డ్రైవర్ తప్పించుకున్న విధానం అందర్నీ షాక్‌కు గురిచేస్తోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో, ఎప్పుడు జరిగిందో తెలియదు. ట్రాక్టర్ డ్రైవర్ గాయాలు కాకుండా తప్పించుకోవడం ఈ వీడియోలో హైలెట్.