ఫ్యాన్సీ నంబర్ అంటే జనాలకు ఎంతో క్రేజ్. తమ ఫోన్ నెంబర్, వైహికల్ నంబర్.. ఇలా అవకాశమున్న ప్రతీ చోటా ఫ్యాన్సీ నంబర్ కోసం ఎగబడుతుంటారు. తమకు కావాల్సిన నంబర్ ను దక్కించుకునేందుకు ఎంత ఖర్చు చేసేందుకైనా వెనకాడరు. ముఖ్యంగా ప్రజల ఇంట్రెస్ట్ ను అవకాశంగా మలుచుకున్న రవాణాశాఖ.. వీఐపీ నంబర్లంటూ అనేక సంఖ్యల సీరీస్లను అమ్మకానికి ఉంచుతోంది. కానీ, కొన్ని సందర్భాలలో ఒకే సంఖ్య కోసం అనేక మంది పోటీ పడుతుంటారు. అటువంటి సమయాల్లో ఆఫీసర్లు బిడ్డింగ్(వేలం) ప్రక్రియను చేపడతారు. ఇందులో పాల్గొన్న వారు ఎంత ఖర్చు చేసైనా సరే చివరకు వారికి నచ్చిన రిజిస్ట్రేషన్ నంబర్‌ను దక్కించుకుంటారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో అలాంటి ఘటనే జరిగింది.
ఓ స్కూటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ సంఖ్య కోసం.. అక్షరాల కోటి రూపాయలకు పైగా ఖర్చు చేశాడో వ్యక్తి. శిమ్లాలో హెచ్‌పీ999999 అనే నంబరును రవాణా శాఖ తాజాగా వేలానికి పెట్టింది. దానికోసం ఇప్పటివరకు 26 మంది బిడ్‌లు దాఖలు చేశారు. వారిలో కోట్‌ఖాయ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఏకంగా రూ.1,00,11,000కు బిడ్ వేశాడు. వాస్తవానికి దాని రిజర్వు ధరను అధికారులు రూ.1,000గానే నిర్ధారించడం గమనార్హం. ఈ నంబర్ ను దక్కించుకున్న వ్యక్తి రూ.లక్ష పెట్టి స్కూటీని కొనుగోలు చేస్తే.. దాని రిజిస్ట్రేషన్ నంబర్ కోసం మాత్రం ఏకంగా రూ.కోటికి పైనే బిడ్డింగ్ చేయడం విశేషం. సాధారణంగా రూ.కోట్లు విలువ చేసే కార్ల కోసం ఇంత పెద్ద మొత్తంలో వెచ్చించి ఫ్యాన్సీ నంబర్లను పొందుతారు కొందరు. కానీ, స్కూటీ కోసం ఇంత మొత్తంలో బిడ్డింగ్ వేయడాన్ని చూసి అధికారులే షాక్ అవుతున్నారు.