sperm ejaculation details all men should know
mictv telugu

వీర్య స్ఖలనంపై ప్రతి మగవాడు తెలుసుకోవాల్సిన విషయాలు..

November 10, 2022

మన సమాజంలో సెక్స్‌పై అనేక అపోహలు ఉన్నాయి. విదేశాల్లో మాదిరి మన పాఠ్యాంశాల్లో లైంగిక విద్య లేకపోవడంతో చాలామంది ఈ విషయంలో గందరగోళపడుతుంటారు. ప్రమాదాలు కొనితెచ్చుకుంటుంటారు. మహిళలకే కాదు, పురుషులకు కూడా లైంగిక విషయాలపై సరైన అవగాహన లేదు. హస్తప్రయోగం మంచిదా, చెడ్డదా అనే ప్రశ్న దగ్గర్నుంచి వీర్యం వరకు ఎన్నో అపోహలు ఉన్నాయి. వీటి గురించి సరైన అవగాహన లేకపోతే ఆందోళన, అనారోగ్యం కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. మగవాళ్లు అంగస్తంభన సమస్య తర్వాత ఎక్కువగా గందరగోళపడేది వీర్యం గురించి. కొన్ని ఆహార పదార్థాలు తీసుకంటే వీర్యవృద్ధి కలుగుతుందని, కొన్ని చేయకూడదని పనులు చేస్తే అసలుకే మోసం వస్తుందని ఎన్నో కథనాలు, వార్తలు తరచూ వస్తుంటాయి. ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో తెలియని పరిస్థితి. ఇప్పుడు ఆరోగ్య విషయాలు అందరికీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి అపోహలను ఎవరికి వారే తొలగించుకోవచ్చు.

రోజుకు ఎన్నిసార్లు..
ఆరోగ్యం, వయసు, రోజులో ఎన్నిసార్లు సెక్స్ చేస్తున్నారనేదాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ఇందులో మేజిక్ నంబర్ అంటూ ఏదీ లేదు. కొందరికి ఒకసారే కావొచ్చు. కొందరికి నాలుగైదు సార్లు కావొచ్చు. ఆరోగ్యంగా ఉన్నంతవరకు ఎలాంటి సమస్యా ఉండదు. అయితే కొన్ని రోజుల నుంచి సెక్సుకు దూరంగా ఉండి తక్కువ వీర్యం వచ్చినా, లేకపోతే రోజూ సెక్స్ చేస్తున్నా అధిక మోతాదులో వచ్చినా జాగ్రత్త పడాలి. ఎక్కువ వీర్యం వస్తే బలంగా ఉన్నట్టు కాదు. ప్రొస్టేట్ గ్రంధికి జబ్బు చేసినా, మరో సమస్య ఉన్నా ఎక్కువ వీర్యం పోతుంది.  ఒకసారి స్ఖలనం చేస్తే 2 నుంచి 5 ఎంఎల్ వీర్యం రావాలి. అంతకు తక్కువైనా, మరీ ఎక్కువైనా జాగ్రత్త పడాలి.

వయసును బట్టి..
పెద్దవాళ్లతో పోలిస్తే యువకుల్లో రోజుకు వీర్యస్ఖలనం ఎక్కువసార్లే జరుగుతుంది. మానసిక, శారీరక ఆరోగ్యం, జీవిత భాగస్వామితో అనుబంధం, హార్మోన్ స్థాయిలు, ఏకాంతం, ఆరోగ్యం వంటికి ప్రభావం చూపుతాయి. వీర్య గ్రంథులు చురుగ్గా పనిచేస్తాయి కాబట్టి స్ఖలనాల సంఖ్య, వీర్యం మోతాదు ఎక్కువగా ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. సాధారణంగా 30 ఏళ్ల నుంచి స్ఖలనాల సంఖ్య తగ్గుతుంది.

నెలకు 21 స్ఖలనాల మేలా?
బ్రిటన్‌లో జరిగిన ఒక అధ్యయనంలో నెలకు 21 స్ఖలనాల వల్ల ప్రొస్టేట్ కేన్సర్ తగ్గుతుందని ప్రాథమికంగా వెల్లడైంది. అయితే ఇదేం తప్పసరి రూలు కాదని వైద్యనిపుణులు అంటున్నారు. తరచూ శృంగారంలో పాల్గొంటే అన్ని అవయవాలు ఆరోగ్యంగా పనిచేస్తాయన్నదే ఇక్కడ కీలకమని చెబుతున్నారు.

వరదై పారితే..
కచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే. హైపర్‌స్పెర్మియా అనే అరుదైన వ్యాధివల్ల వీర్యం ఎక్కువ మోతాదులో వెలువడుతుంది. వందమంది పురుషుల్లో 3 నుంచి 4 శాతం మందికి ఈ సమస్య ఉంటుంది. వీరి వీర్యం మోతాదు 6.3 ఎంఎల్ లేదా 0.21 ఔన్సులు ఉంటుంది. ప్రొస్టేట్ గ్రంధిలో ఇన్ఫెక్షన్ దీనికి కారణం.

వీర్యం అసలు రాకపోతే..
ఇలాంటి పరిస్థితి ఉండదు. వీర్యం రోజూ ఉత్పత్తి అవుతుంటుంది. అదొక నిరంతర ప్రక్రియ. పురుషుడు ఒక వీర్యోత్పతి దశలో(స్పెర్మ్ ప్రొడక్షన్ సైకిల్)లో 8 బియిన్ల స్పెర్మ్ ఉత్పత్తి చేస్తాడు. దీనికి రెండు నెలల సమయం పడుతుంది.

లాభాలు.. నష్టాలు
తరచూ స్ఖలనం వల్ల ఆరోగ్య సమస్యలు రావు. ప్రొస్టేట్ కేన్సర్ ముప్పు తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. సుఖ సంసారం వల్ల మానసిక ఆందోళన ఉండదు. ఆక్సిజన్ మోతాదు పెరుగుతుంది. నిద్రబాగా పడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. స్ఖలనాలు అసలు జరక్కపోతే సమస్యలు వస్తాయి. బ్రహ్మచర్యం, సంప్రదాయాలు వంటి వేర్వేరు కారణాల వల్ల కొందరు సెక్సుకు, హస్తప్రయోగానికి దూరంగా ఉంటారు. దీనివల్ల ఆరోగ్యంగా, సంతోషంగా, ఏకాగ్రతతో ఉంటామని కొందరు చెప్పుకున్నప్పటికీ అందుకు ఆధారాలు లేవు. స్ఖలనం తరచూ జరగకపోతే వీర్యం నాణ్యత పడిపోయే ప్రమాదముంది. టెస్టోస్టిరెన్ పనితీరులో మార్పులు వస్తాయి. పేరుకుపోయిన వీర్యం దేహంలో కలసిపోతుంది, లేకపోతే నిద్రలో వెళ్లిపోతుంది. అయితే దీనివల్ల తీవ్ర అనారోగ్య సమస్యలేం రావని పరిశీలకులు అంచనా. ఈ విషయంలో ఇంకా పూర్తిస్థాయి పరిశోధనలు జరగలేదు. ఆరోగ్యకరమైన జీవితం, శృంగారంలో సుఖమే ముఖ్యమన్నది ఆరోగ్య నిపుణుల మాట.