SR Nagar Police has created a special app for monitoring lodges and hostels
mictv telugu

హైదరాబాద్‌లో లాడ్జీలు, హాస్టళ్లపై గట్టి నిఘా.. యాప్‌తో మొత్తం గుట్టు గుప్పిట్లో

November 15, 2022

హైదరాబాద్ మహానగరంలో విచ్చలవిడిగా ఉన్న లాడ్జీలు, ప్రైవేట్ హాస్టళ్లపై పోలీసులు గట్టి నిఘా వేస్తున్నారు. నేరగాళ్లను అడ్డుకునే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎక్కడో నేరం చేసిన నేరస్థులకు ఇక్కడి లాడ్జీలు, హాస్టళ్లు ఆశ్రయం కల్పిస్తున్నాయి. ఇక్కడ నేరం చేయడానికి వచ్చిన వాళ్లు కూడా తెలివిగా వీటిని ఆశ్రయిస్తున్నారు. దీంతో ఎవరు ఉంటున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇంతకుముందు ఎక్కడ ఉంటున్నారు? ఇలా ఏ విషయమూ పోలీసులకు తెలియడం లేదు. దీనికి పరిష్కారంగా పోలీస్ శాఖ ఓ ప్రత్యేక యాప్ తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

ముందుగా ఎస్సార్ నగర్ పోలీస్ పరిధిలో ప్రయోగాత్మకంగా త్వరలో అమలు చేయనున్నారు. పోలీస్ విభాగం ఆధ్వర్యంలో పని చేసే ఈ యాప్‌‌ను లాడ్జీలు, హాస్టళ్ల నిర్వాహకులు ముందుగా డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో ఉన్న కేటగిరీల ఆధారంగా బాయ్స్ హాస్టల్స్, ఉమెన్స్ హాస్టల్, వర్కింగ్ మెన్ హాస్టల్, లాడ్జీలను ఎంచుకోవాలి. అందులో బస చేస్తున్న వ్యక్తి పేరు, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఏం చేయడానికి వచ్చాడు, గతంలో ఎక్కడ పని చేశాడు తదితర వివరాలన్నీ నమోదు చేస్తారు. వీటితో పాటు ఫోటోను క్యాప్చర్ చేసి అప్ లోడ్ చేస్తారు. బస చేసిన వ్యక్తి ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే దానికి ఓటీపీ వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతో రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఈ యాప్‌లో పొందుపరిచే వివరాలను వాంటెడ్ వ్యక్తులు, పదేపదే నేరాలు చేసే క్రిమినల్స్ వివరాలతో కూడిన డేటాబేస్‌‌కు అనుసంధానం చేస్తారు. దీని వల్ల నేరాలను తగ్గించడానికి, నేరస్థులను పట్టుకోవడం సులువుగా ఉంటుందని పోలీసుల ఆలోచన. ముందుగా దీనిని మూడు కమిషనరేట్లలో పరిశీలించి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని చూస్తున్నారు. అయితే యాప్‌లో వివరాలు నమోదు చేయడాన్ని ఒత్తిడితో కాకుండా స్వచ్ఛందంగా ఉండేలా యజమానులతో చర్చిస్తారని సమాచారం.