‘ధమాకా’ పాప శ్రీలీల వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. పెళ్లి సందD సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఈ కన్నడ అందం.. ఒకే సినిమాతో మంచి పాపులారిటీని తెచ్చుకుంది. ధమాకా తర్వాత శ్రీలీల ప్రస్తుతం మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమాలో నటిస్తోంది. షూటింగ్‌లో పాల్గోన్న కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సినిమాతో పాటు ఇక లేటెస్ట్‌గా పవన్ – సాయి ధరమ్ తేజ్ సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్‌లో నటించనుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది శ్రీ లీల. దీనికి సంబంధించి ఓ ప్రకటన విడుదలైంది.
వీరసింహారెడ్డి సినిమా తర్వాత అనిల్ రావిపూడితో కొత్త సినిమాను మొదలు పెట్టారు నటసింహం బాలకృష్ణ. NBK 108గా వస్తోన్న ఈసినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీలీల ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ మూవీలో బాలయ్య కూతురిగా శ్రీ లీల కనిపించనుందని అంటున్నారు. తండ్రి కూతురి మధ్య జరిగే కథ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. అందులో భాగంగా ఆమె ఈరోజు షూట్‌లో జాయిన్ అయ్యారని తెలుస్తోంది. ఈ మేరకు బాలయ్య చేయి పట్టుకున్నట్లుగా ఉన్న శ్రీలీల ఫొటోను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.
ఈ సినిమాలో బాలయ్య సరసన కథానాయికగా ఎవరు నటిస్తారనే విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ‘అఖండ’ .. ‘వీరసింహా రెడ్డి’ సినిమాలను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో తమన్ నిలబెట్టిన కారణంగా, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.