రంగారెడ్డి జిల్లా నార్సింగి శ్రీ చైతన్య కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న సాత్విక్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి 10. 30 సమయంలో క్లాస్ రూంలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన తోటి విద్యార్థులు వెంటనే రోడ్డుపై వెళుతున్న బైకర్‌ను లిఫ్ట్ అడిగి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే, కాలేజీలో ఒత్తిడి వల్లే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇంత జరిగినా సాత్విక్ ఆత్మహత్య పై శ్రీచైతన్య యాజమాన్యం స్పందించ లేదు. ప్రాణపాయ స్థితిలో ఉన్న విద్యార్థిని కనీసం ఆస్పత్రికి కూడా తీసుకెళ్లలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
గతంలో సాత్విక్ ను లెక్చరర్స్ కొట్టడంతో 15 రోజుల పాటు ఆస్పత్రిపాలయ్యడని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆ సమయంలోనే అతన్ని ఏం అనొద్దని యాజమాన్యానికి చెప్పామని, అయినా కూడా యాజమాన్యం వినలేదని.. తమ కొడుకు మృతికి యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని సాత్విక్ తల్లిదండ్రులు అంటున్నారు. సాత్విక్ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు. కాగా, సాత్విక్ ఆత్మహత్య వెలుగు చూడగానే వార్డెన్ నరేష్ గోడ దూకి పారిపోవటం గమనార్హం.