ఆర్ధిక సంక్షోభంతో అవస్థలు పడుతున్న శ్రీలంకను క్రికెట్ ఆట తనవంతు ఆదుకుంది. 2022 ఏడాదికి గాను ఏకంగా రూ. 630 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఇది బోర్డు చరిత్రలోనే అత్యధిక మొత్తం కావడం విశేషం. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్, స్పాన్సర్ షిప్ కాంట్రాక్టులు, ఐసీసీ వార్షిక సభ్యుల చెల్లింపుల ద్వారా భారీ లాభం సాధ్యపడిందని క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. తీవ్ర ఆర్ధిక, రాజకీయ సంక్షోభంలోనూ ఆ దేశం ఆస్ట్రేలియాతో టీ20, వన్డే, టెస్టు మ్యాచులు ఆడింది.
ఈ మ్యాచులకు అభిమానులు భారీగా తరలివచ్చి కష్టాల్లో ఉన్న తమదేశానికి క్రికెట్ ఆడడానికి వచ్చిన ఆస్ట్రేలియాకు ధన్యవాదాలు తెలిపారు. ఇక త్వరలో లంక జట్టు న్యూజిలాండ్‌లో ఆ దేశంతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులు ఆడనుంది. ఇదిలా ఉంటే లంక క్రికెట్ కోసం కొత్త రాజ్యాంగాన్ని రూపొందిస్తున్నామని ఆ దేశ క్రీడా మంత్రి రోషన్ రణసింగ్ ప్రకటించారు. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఆధ్వర్యంలో పది మందితో కూడిన కమిటీని నియమించామని, రెండు నెలల్లో కొత్త రాజ్యాంగం అమల్లోకి వస్తుందని వెల్లడించారు.