Sri Lanka legend Mahela Jayawardene congratulates Virat Kohli
mictv telugu

విరాట్ యోధుడు…అతనికి ఎదురులేదు

November 4, 2022

టీ 20 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లి విజృంభిస్తున్నాడు. తన అద్భుతమైన బ్యాటింగ్‌తో టీం ఇండియాకు విజయాలను అందిస్తున్నాడు. ఇప్పటి వరకు అతను ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు. ఈ మూడు మ్యాచుల్లోనూ భారత విజయాల్లో కీలకపాత్ర విరాట్ కోహ్లీదే. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 82 పరుగులతో అజేయంగా నిలిచి భారత్‌‌ను విజయ తీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటింగ్‌కు క్రికెట్ ప్రేమికులు మంత్రమగ్థులయ్యారు. బంగ్లాదేశ్‌పై 44 బంతుల్లో 64 పరుగులతో చేసి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అందుకున్నాడు.. ఈ క్రమంలోనే పలు రిక్డార్డులను విరాట్ తన పేరిట రాసుకున్నాడు.

ఇప్పటికే అద్భుత రికార్డులను తన పేరిట లిఖించుకున్న ఈ రన్ మిషన్.. టీ 20 వరల్డ్ కప్‌లోను ఆరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌లలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ చరిత్రకెక్కాడు. ఇప్పటి వరకు శ్రీలంక క్రికెటర్ జయవర్దనే పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. తన కెరీర్‌లో 31 టీ20 ప్రపంచకప్ మ్యాచులు ఆడిన జయవర్దనే. 1016 పరుగులు చేయగా కోహ్లీ కేవలం 25 మ్యాచుల్లోనే 1065 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌పై జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత అందుకున్నాడు.

కోహ్లీ తని రికార్డు చెరిపివేయడంపై జయవర్దనే స్పందించాడు. విరాట్ కోహ్లీని ప్రశంసలతో ముంచెత్తాడు.”రికార్డులను సృష్టించేందుకు..ఉన్న రికార్డులను చెరిపివేసేందుకు ఒకడు ఉంటాడు అతడే విరాట్. ఈ అద్భుతమైన ఆటగాడికి నా అభినందనలు. ఫామ్ తాత్కాలికమే..క్లాస్ మాత్రమే శాస్వతం..నువ్వు ఎప్పుడూ యోధుడివే” అంటూ జయవర్దనే కొనియాడాడు.