Sri Lankan President Gotabaya Rajapaksa flees as angry protesters storm his home
mictv telugu

పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు.. ఇంటిని చుట్టుముట్టిన నిరసనకారులు

July 9, 2022

Sri Lankan President Gotabaya Rajapaksa flees as angry protesters storm his home

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా అక్కడి ప్రజలు ప్రభుత్వ తీరుకు నిరసనగా.. ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తున్నారు. ప్రజాగ్రహం కారణంగా ఇప్పటికే మహీంద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఆయన సోదరుడు, దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన అధికారిక నివాసం నుంచి పరారయ్యారు. గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలంటూ ఆందోళన చేస్తున్న ప్రతిపక్షాలు, ప్రజలు ఆయన నివాసాన్ని ముట్టడించగా… ఆయన పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ దేశ రక్షణ శాఖ వర్గాలు వెల్లడించినట్లు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి.

శనివారం ఉదయం అధ్యక్షుడి నివాసం వద్ద నిరసన చేస్తున్న ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగులను ఉపయోగించారు. నిరసనకారులు లోపలికి రాకుండా పోలీసులు కాల్పులు జరిపారు. అయితే ఆందోళనకారులు.. బారికేడ్లను తొలగించి అధ్యక్షుడి కార్యాలయంలోకి ప్రవేశించారు. ఈ ఘర్షణలో ఇద్దరు పోలీసులతో సహా 30 మంది గాయపడ్డారని తెలుస్తోంది. వీరందరూ కొలంబోలోని జాతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం. ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దేందుకు శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే ప్రయత్నిస్తున్నారు. పార్టీ నేతలను అత్యవసర సమావేశానికి పిలిచారు. గతంలో కూడా అప్పటి ప్రధాని మహింద రాజపక్స ఇంటిని ఆందోళనకారులు ముట్టడించటం వల్ల ఆయన కూడా ఇలాగే పారిపోయారు.