నా హత్యకు భారత్ కుట్ర.. శ్రీలంక అధ్యక్షుడు - MicTv.in - Telugu News
mictv telugu

నా హత్యకు భారత్ కుట్ర.. శ్రీలంక అధ్యక్షుడు

October 17, 2018

శ్రీలంక అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన సంచలన ఆరోపణలు చేశారు. తనను హత్య చేయడానికి భారత్ యత్నిస్తోందన్నారు. భారత గూఢచర్య సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా) తనను చంపడానికి పథకం వేసినట్లు నిఘా వర్గాల ద్వారా తెలిసిందని మంగళవారం కేబినెట్ సమావేశంలో ఆయన వెల్లడించారు. దీంతో మంత్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

అయితే రా కుట్ర గురించి భారత ప్రధాని నరేంద్ర మోదీకి తెలియకపోవచ్చని సిరిసేన పేర్కొన్నారు. లంక ప్రధాని రణిల్ విక్రమసింఘే త్వరలో భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో సిరిసేన ఈ ఆరోపణలు చేశారు. దీనిపై పూర్తి వివరణ కోసం విలేకర్లు సిరిసేన కార్యాలయాన్ని సంప్రదించడానికి యత్నిస్తోంది. సిరిసేనతోపాటు మాజీ రక్షణ మంత్రి గోతబయ రాజపక్సను చంపడానికి రా కుట్ర పన్నుతున్నట్లు తనకు తెలిసిందని లంక అవినీతి నిరోధక విభాగానికి చెందిన నమల్ కుమార్ అనే వ్యక్తి చెప్పినట్లు తెలుస్తోంది. సెప్టెంబరులో అరెస్టయిన ఓ భారతీయణ్ని విచారించగా ఈ విషయం బయటిపడిందని చెబుతున్నారు. భారత రాపై లంక ప్రభుత్వం ఆరోపణలు చేయడం ఇదేం తొలసారి కాదు. 2015 నాటి లంక ఎన్నికలను ప్రభావితం చేయడానికి రా యత్నించిందని మాజీ అధ్యక్షుడు మహీంద రాజపక్స ఆరోపించారు.