దేశం విడిచి పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మెయిల్ ద్వారా ఆయన తన రాజీనామాను పార్లమెంట్ స్పీకర్‌కు పంపారు. ఈ మేరకు రాజీనామా పత్రం తనకు అందినట్లు పార్లమెంట్ స్పీకర్ కూడా ధ్రువీకరించారు. దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రజలు ఆందోళనలు చేపట్టడంతో గొటబయ రాజీనామా చేయకుండా దేశం విడిచిపారిపోయాడు. మాల్దీవులు నుంచి గట్టి భద్రత మధ్య ఇవాళ సౌదీ ఎయిర్‌లైన్స్ విమానంలో ఆయన సింగపూర్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన తమను ఆశ్రయం కోరలేదని, ప్రైవేట్ పర్యటనలో భాగంగా వచ్చారని సింగపూర్ విదేశాంగ శాఖ తొలుత వెల్లడించింది. మొత్తం వ్యవహారంలో మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది.
మొదట ఈనెల 13న తను అధ్యక్ష పదవి నుంచి వైదొలగుతానని చెప్పారు గొటబయ. ఆ తర్వాత తనను దేశం దాటనిస్తేనే రాజీనామా చేస్తానంటూ మెలిక పెట్టారు. ఇవాళ సురక్షితంగా సింగపూర్‌కు చేరిన తర్వాతే రాజపక్స రాజీనామా చేసినట్లు సమాచారం.