శ్రీలంక.. ఒకరోజు గడవక ముందే కొత్త ఆర్థికమంత్రి రాజీనామా - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీలంక.. ఒకరోజు గడవక ముందే కొత్త ఆర్థికమంత్రి రాజీనామా

April 5, 2022

gnfgn

పొరుగు దేశం శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకూ దారుణంగా మారుతున్నాయి. ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా, ఏ మాత్రం చక్కబడే అవకాశాలు కనిపించడం లేదు. ఇటీవలే క్యాబినెట్ అంతా మూకుమ్మడిగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖకు కొత్త మంత్రిగా అలీ సబ్రీ నియమితులయ్యారు. గతంలో ఆ శాఖకు మంత్రిగా అధ్యక్షుడి సోదరుడు బాసిల్ రాజపక్స ఉండేవారు. ఆయన స్థానంలో వచ్చిన అలీ కూడా ఒక్క రోజులోనే తన పదవికి రాజీనామా చేశారు. అలీ ఇటీవలే న్యాయశాఖ మంత్రిగా ఉంటూ మిగతా క్యాబినెట్ మిత్రులతో పాటు రాజీనామా చేశారు. దీంతో మూడ్రోజుల వ్యవధిలో రెండు శాఖలకు రెండుసార్లు రాజీనామా చేసిన మంత్రిగా నిలిచారు.

రాజీనామా నేపథ్యంలో తన అభిప్రాయాన్ని అలీ సబ్రీ ఓ లేఖ ద్వారా వెల్లడించారు. అధ్యక్షుడికి రాసిన రాజీనామా లేఖలో ‘దేశంలో నెలకొన్న ఇలాంటి ప్రత్యేక పరిస్థితులలో తాత్కాలిక ఆర్ధిక మంత్రిగా మీ ఆదేశం మేరకు నేను బాధ్యతలు చేపట్టాను. కానీ, ప్రస్తుతం దేశానికి పూర్తిస్థాయి ఆర్ధిక మంత్రి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. అందువల్ల నేను ఈ పదవిలో ఉండడం సబబు కాదు. నా వల్ల జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాను. దేశ ప్రయోజనాల రీత్యా ఇలా చేయాల్సి వచ్చింద’ని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఆ దేశ ప్రతిపక్ష నేతలు భారత సహాయాన్ని అర్థిస్తున్నారు. మోదీ గారు వీలైనంత మేర సహాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.