శ్రీరెడ్డికి శేఖర్ కమ్ముల హెచ్చరిక - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీరెడ్డికి శేఖర్ కమ్ముల హెచ్చరిక

April 3, 2018

తెలుగు నటి శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. సినీపరిశ్రమలో తెలుగు అమ్మాయిలను వాడుకుని వదిలేస్తున్నారని, ముంబై భామలకే ప్రాధాన్యమిస్తున్నారని ఆమె ఆరోపించడం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములపైనా విమర్శలు సంధించింది. తెలుగు అమ్మాయిలంటే పక్కలోకి తప్ప ఎందుకూ పనికారానని అతడు భావిస్తాడని, మగ ఆర్టిస్టుల వద్ద డబ్బులు తీసుకుంటాడని, తమ ఇంటి ముందు పడిగాపులు కాశాడని తెలపింది. దీనిపై కమ్ముల భగ్గుమన్నాడు.

నన్ను కించపరుస్తూ, సోషల్ మీడియాలో నిన్న వచ్చిన పోస్ట్, నా దృష్టికి వచ్చింది.ఆ పోస్ట్ లో ప్రతీ మాట అబద్ధం. అసభ్యం. అవమానకరం. ఆ పోస్ట్ నాకు, నా కుటుంబానికి, నన్ను గౌరవించేవారికి చాలా మనస్థాపం కలిగించింది.

నేను ఎప్పుడూ కలవని, అసలు చూడనే చూడని, కనీసం ఫోన్లో కుడా మాట్లాడని అమ్మాయి , నా గురించి ఆధారం లేని ఆరోపణలు చేయటం షాకింగ్ గా ఉంది. ఈ దిగజారుడు చర్య వెనక ఎవరున్నా, వారి ఉద్దేశం ఏమైనా, నేను చెప్పదల్చుకున్నది ఒకటే. ఇది తప్పు, నేరం, అనైతికం.  స్త్రీ ల సమానత్వం, సాధికారతలని నేను ఎంత నమ్ముతానో నా సినిమాలు, నా కార్యక్రమాలు చూస్తే అర్ధమౌతుంది. నా వ్యక్తిత్వం, నమ్మే విలువలు నా ప్రాణం కంటే ముఖ్యం. వాటి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే, వదిలి పెట్టే ప్రసక్తి లేదు. ఆ పోస్ట్‌లోని ప్రతీ మాట తప్పు అని ఒప్పుకొని, క్షమాపణ చెప్పకపోతే, చట్టపరంగా చర్యలు తీసుకుంటాను.’ అని స్పష్టం చేశారు.