ఇవి శ్రీదేవి ఆఖరి కోరికలా.. మీ కోరికలా! - MicTv.in - Telugu News
mictv telugu

ఇవి శ్రీదేవి ఆఖరి కోరికలా.. మీ కోరికలా!

February 28, 2018

‘జగన్ పాదయాత్ర దృశ్యాలను, కాలిబొబ్బలను చూసి శ్రీదేవి కన్నీళ్లు పెట్టుకునేది. అతణ్ని ఏపీకి ముఖ్యమంత్రిగా చూడ్డం కంటే దేశానికి ప్రధానమంత్రిగా చూడాలన్నది ఆమె ఆఖరి కోరిక..’ అని ఒక వార్త.

‘చంద్రబాబు నాయుడిని ఈ దేశానికి ప్రధానమంత్రిగా చూడాలన్నది శ్రీదేవి చివరి కోరిక. చంద్రబాబు ప్రభుత్వం ఏపీ ప్రజలను సుఖసంతోషాలతో ఉంచుతోందని ఆమె కొనియాడేవారు.. నారా లోకేశ్ సీఎం కావాలని, తర్వాత ప్రధాని కావాలని, అందుకు అతనికి అన్ని అర్హతలు ఉన్నాయని ఆమె తన సన్నిహితులతో చెప్పేవారు..’ అని మరొక వార్త.‘ప్రధాని మోదీ నాయకత్వంలో ఈ దేశం కనీవినీ ఎరగని ప్రగతి సాధిస్తోంది. ఆయన ప్రభుత్వం మళ్లీ మళ్లీ అధికారంలోకి రావాలి.. నోట్ల రద్దుతో ఆయన అవినీతిని నిర్మూలించారు. ఆయన దేశానికి కాకుండా మొత్తం ప్రపంచానికే ఆదర్శం. ఆయన జీవితాంతం ప్రధానిగా ఉండాలన్నది శ్రీదేవి అంతిమ ఆకాంక్ష’ అని మరొక వార్త..

ఇలా సోషల్ మీడియాలో లెక్కలేనన్ని ‘శ్రీదేవి అంతిమ కోరికలు’ షికార్లు చేస్తున్నాయి. అన్నీ నకిలీ వార్తలే. శవరాజకీయాలే. శ్రీదేవికి ఉన్న ఫాలోయింగ్‌ ను రాజకీయా ప్రయోజనాల కోసం వాడుకోవాలన్న కక్కుర్తితో మీడియాను ఇలాంటి చెత్తాతిచెత్త వార్తలతో నింపేస్తున్నారు. దీనికి టెక్నాలజీ, ఫోటో షాపులు కూడా తోడు కావడంతో చూసిన వాళ్లలో కొందరు ‘అవునేమో..’ అని అనుకుంటున్నారు.

‘పవన్ కల్యాణ్ గొప్ప రాజకీయ నాయకుడు. ఆయన ప్రధాని అయితేనే ఈ దేశం బాగుపడుతుంది. ఏపీ, తెలంగాణ ప్రజలే కాకుండా యావద్దేశ ప్రజలూ జనసేన పార్టీకి ఓటేసి గెలిపించాలన్నది శ్రీదేవి అంతిమ కోరిక..’ అని మరోవార్త.

ఒక మహనటి చనిపోతే ఆ సందర్భాన్ని ఇలా దుర్మార్గంగా వాడుకోవడంపై అదే సోషల్ మీడియాలో విమర్శలూ వెల్లువెత్తున్నాయి. ఈ దిక్కుమాలిన కోరికలు శ్రీదేవివా లేకపోతే మీ చివరి కోరికలా? అని మండిపడుతున్నారు.