మనకు తెలియని శ్రీదేవి.. కన్నీళ్లు పెట్టిస్తున్న వర్మ లేఖ   - MicTv.in - Telugu News
mictv telugu

మనకు తెలియని శ్రీదేవి.. కన్నీళ్లు పెట్టిస్తున్న వర్మ లేఖ  

February 27, 2018

అతిలోక సుందరి శ్రీదేవి అంటే దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఎంత అభిమానమో అందరికీ తెలిసింది. ఆమె మరణాన్ని తట్టుకోలేకపోతున్నానని, చచ్చిపోవాలని ఉందని వర్మ ఆవేదన పడుతున్నాడు. శ్రీదేవితో క్షణక్షణం, గోవిందా..గోవిందా సినిమాలు తీసిన వర్మకు ఆమెతో చక్కని అనుబంధం ఉంది. ఆమె కుటుంబ విషయాలు కూడా తెలుసు. శ్రీదేవి నిజానికి పైకి కనిపించేంత సంతోషంగా లేదని, ఆమె జీవితంలో అసంతృప్తి, పెను దు:ఖం పేరుకుపోయాయని వర్మ ఈ రోజు ఫేస్‌బుక్‌లో తెలిపాడు. శ్రీదేవి అభిమానులకో ప్రేమలేఖ పేరుతో రాసిన లేఖలో ఆమె గురించి ఎన్నో షాకింగ్ విషయాలు తెలిపాడు. ఎంతో భావోద్వేగంతో సాగే ఈ లేఖ అభిమానులను కన్నీటిపర్యంతం చేస్తోంది.వర్మ చెప్పింది ఆయన మాటల్లోనే..

‘మీలాగే నేను కూడా శ్రీదేవి అతిలోక సుందరి అని నమ్ముతాను. కానీ ఈ కథకు మరో కోణం కూడా ఉంది… సెలబ్రిటీలను బయటి ప్రపంచం చూసే చూపుకు, వాస్తవానికి ఉన్న వ్యత్యాసానికి శ్రీదేవి చక్కని ఉదాహరణ..

శ్రీదేవి జీవితం సంపూర్ణం. అందమైన ముఖం, గొప్ప టాలెంట్, ఇద్దరు అందమైన కూతుళ్లతో చక్కని కాపురం..అంతకు మించి ఏం కావాలని అనుకుంటారు. కానీ నిజంగా శ్రీదేవి సంతోషంగా జీవించిదా? లేదు.

నాకు ఆమె గురించి తెలుసు. ఆమె తన తండ్రి మరణించేంత వరకు ఆకాశంలో హాయిగా పక్షిలా ఎగిరింది. అయితే తర్వాత, తల్లి అతిరక్షణ ధోరణి వల్ల పంజరంలో చికుక్కున్న పక్షి అయిపోయింది. ఆ రోజుల్లో తారలకు పారితోషికాన్ని నల్లధనం రూపంలో ఇచ్చేవారు. ఆదాయ పన్ను దాడుల భయంతో శ్రీదేవి తండ్రి ఆమె డబ్బును బంధమిత్రుల వద్ద దాచేవారు. అయితే ఆయన చనిపోగానే వారు ఉత్తచేతులు చూపారు. దీనికి ఆమె తల్లి(రాజేశ్వరి) అమాయకత్వం కూడా తోడైంది. కూతురి డబ్బుతో న్యాయవివాదాల్లో ఉన్న ఆస్తులు కొన్నది. ఈ పొరపాట్ల వల్ల శ్రీదేవి చేతిల్లో చిల్లిగవ్వ లేకుండా పోయింది. అప్పడే బోనీ ఆమె జీవితంలోకి వచ్చాడు. అతనికీ పుట్టెడు అప్పులు. ఏడవడానికి ఓ తోడు మాత్రమే దొరికింది అందాల తారకు.

శ్రీదేవికి తల్లికి చేసిన సర్జరీలో పొరబాటు జరిగింది. శ్రీదేవి చెల్లెలు శ్రీలత పొరుగింటి కుర్రాడితో లేచిపోయింది. తల్లి అప్పటికి మిగిలిన ఆస్తులను శ్రీదేవి పేరిట రాసి పోయింది. అయితే తల్లికి పిచ్చి ఉందని, ఆమె వీలునామా చెల్లదని శ్రీలత కోర్టుకెక్కింది.ఈ పరిణామాలతో ప్రపంచమంతా మోహించే ఒక మహిళ చివరికి బోనీ తప్ప చేతిలో పైసల్లేకుండా ఒంటరిగా మిగిలిపోయింది. బోనీని రెండో పెళ్లి చేసుకున్నందుకు అతని తల్లి శ్రీదేవిని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో కడుపులో తన్నింది. తర్వాత ఇంగ్లిష్ వింగ్లిష్‌ మెరుపు కాలం తప్ప శ్రీదేవి జీవితమంతా విషాదమే. భరోసా లేని భవిష్యత్తు, ఒడిదొడుకులు ఆమె సున్నిత మనసుపై లోతైన గాయాలు చేశాయి. మనసులో శాంతి అనేదే లేకుండా పోయింది..

ఆమె అందగత్తె. కానీ పైబడుతున్న వయసు ప్రతి నటికీ ఒక పీడకల. అందుకు శ్రీదేవి కూడా అతీతం కాదు. తరచూ కాస్మటిక్ సర్జీలు చేయించుకునేది.. తనలో ఏం జరుగుతోందో బయటికి వారికి తెలియకుండా ఆమె మానసికంగా తనచుట్టూ ఒక గోడ కట్టుకుంది. తన స్వభావం ఇతరులకు తెలియకుండా మేకప్ వేసుకుని జీవించింది తన ఇష్టాయిస్టాల ప్రకారం కాకుండా తన తల్లిదండ్రులు, బంధువులు, భర్త, పిల్లల కోరికల ప్రకారం ఆమె నడుచుకుంది. తన పిల్లలను జనం ఆదరిస్తారో లేదోనని బెంగపడింది.

శ్రీదేవి..  నిజానికి ఒక మహిళ దేహంలో చిక్కుకున్న పసిపిల్ల… ఎవరైనా చనిపోతే ఆత్మకు శాంతి కలగాలి అని అనడం ఆనవాయితీ. కానీ శ్రీదేవి విషయంలో నేను నిజంగా ఇదే గట్టిగా కోరుకుంటున్నాను.. చనిపోయాక ఆమె తొలిసారిగా అసలు సిసలైన శాంతితో ఉంటుందని నాకు గట్టి నమ్మకం..యాక్షన్.. కట్.. మధ్య కెమెరా ముందు మాత్రమే ఆమె శాంతంగా ఉండేది. కఠిన వాస్తవాల నుంచి తప్పుకుని తన కలల ప్రపచంలోకి వెళ్లడానికి అదే దారి. తనను బాధించిన ఈ లోకం నుంచి ఎంతో దూరంగా వెళ్లిపోయిన శ్రీదేవి కచ్చితంగా ఆత్మశాంతితో ఉంటుంది. కానీ ఆమెకు ఇంత అన్యాయం చేసిన ఈ లోకం మాత్రం ఇక ప్రశాంతంగా ఉండదు..

శ్రీదేవీ.. మేం చిన్నప్పటి నుంచి నీపైన మోయలేని భారం మోపాం.. కానీ నువ్వు మాత్రం మాకు సంతోషాన్ని, ఆనందాన్ని పంచావు. మేం నీకు తీరని అన్యాయం చేశాం. కానీ నీకు ఏమైనా చేయడానికి చేయిదాటిపోయింది.

ఆ స్వర్గసీమల్లో నువ్వు శాంతంగా, నీ కళ్ళ నిండా సంతోషంతో స్వేచ్ఛా విహంగంలా ఎగుతున్నట్లు నేను కలగంటున్నాను.. నాకు పునర్జన్మపై నమ్మకం లేదు. అయినా ఇప్పుడు నమ్ముతున్నా.. మీ అభుమానులం వచ్చే జన్మలోనూ నిన్ను చూడాలని కోరుకుంటున్నాం. నిన్ని బాధించిన మేం మా తప్పులు సవరించుకుంటాం..

శ్రీదేవీ.. మాకు ఆ అవకాశం ఇవ్వు. మేం నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాం..

నేను ఇలా ఎంతైనా రాసుకుంటూ వెళ్లగలను.. కానీ నా కళ్లలో కన్నీళ్లు ఆగడం లేదు..

ఆర్జీవీ’