ఆమె అందం  అపురూపం. నటన అనన్య సామాన్యం.  అయినా శ్రీదేవి జీవితం సగం సగమే .. - MicTv.in - Telugu News
mictv telugu

ఆమె అందం  అపురూపం. నటన అనన్య సామాన్యం.  అయినా శ్రీదేవి జీవితం సగం సగమే ..

February 25, 2018

ఆ కళ్ళు ఆలా గిరా గిరా తిప్పుతూ మొహం లో అమాయకత్వాన్ని, నటనలో  హుందాతనాన్ని  జోడించి భారత చలన చిత్ర రంగం లో తనదైన ముద్ర వేసిన శ్రీదేవి ఇక కళ్ళు తిప్పలేదు. గుక్క తిప్పుకోనివ్వని నటనతో పాటు  బొద్దు ముక్కు తో  పలికించిన విరుపు ఇప్పుడు   హఠాత్తుగా శ్వాస తీసుకోవడo మానేసింది. నిన్న రాత్రి  దుబాయ్ లో మేనల్లుడి వివాహానికి హాజరు కావడానికి వెళ్లిన  తర్వాత శ్రీదేవి  రాత్రి 11 గంటలకు తీవ్ర గుండెపోటు రావడంతో హఠాత్తుగా తనువు  చాలించింది.

శ్రీదేవి వెండితెరకు నిలువెత్తు ప్రతిరూపం అనడంలో అతిశయోక్తి లేదు. అంత కంటే వెండితెరే ఆమెను తన తనకు అనుగుణంగా తీర్చిదిద్దుకుందేమో అనిపిస్తుంది. నాలుగేళ్లకే వెండితెరకు పరిచయమయ్యి, బాల నటిగా ఎన్నో తెలుగు తమిళ చిత్రాల్లో నటించిన తర్వాత కే. బాలచందర్ దర్శకత్వం లో మొదటి సారి కథా నాయకిగా ముండ్రు ముడిచ్చు చిత్రం లోనే ఎంతో పరిణతి కనబరిచింది.  అది ఒక క్లాసిక్ చిత్రంగా నిలిచిపోయింది. .

కమల హాసన్, రజినికాంత్ లతో  పోటీ పడి  నటించిన వైనం బాలచందర్ ని సైతం ఆశ్చర్య పరిచింది. 16 ఏళ్ళ వయసు (తమిళO లో 16 వయితినిలే, భారతి రాజా దర్శకత్వం వహించారు ) చిత్రం తో తెలుగులో హీరోయిన్ గా అడిగి పెట్టింది. అందులో కనబరచిన రుప లావన్యాల తో పాటు ఇంకా పసితనం పోని అమాయకత్వంతో కూడిన నటన తర్వాత ఆమె జీవితకాలం కొనసాగింది. అగ్ర కథానాయకులతో వరుస పెట్టి సినిమాలు చేసినా ప్రతి సారి వెండి తెరపై కొత్తగా, సహజంగా కనిపించేందుకు ఆమె పడిన తాపత్రేయం అసామాన్యం..హిందీ లో ఆమె మొదటి చిత్రం జూలీ. అందులో హీరోయిన్ పాత్ర కు చెల్లెలిగా నటించినా తర్వాత కాలంలో అగ్ర తారగా మారడానికి ఎంతో సమయం పట్టలేదు.   దివి నుంచి భువి కేగిన అప్సరసగా, ఇంద్రజగా ఇంద్రజాలం చేసి హడావిడిగా వెళ్ళిపోయినట్టే ఉంది శ్రీదేవి మరణం

ఒకప్పుడు బాలనటిగా ఎన్టీయార్ కి మానవరాలిగా నటించి అదే ఎన్టీయార్ పక్కన  హీరోయిన్ గా నటించడం తెలుగు సినిమా వైచిత్రి కాగా శ్రీదేవి చేసిన ఎక్కువ చిత్రాలు కమర్షియల్ సినిమాలే అయినా  హీరోయిన్ పాత్ర పరిమితుల్లోంచి బయటపడి ప్రేక్షకుల చూపుల్ని తనచుట్టూ తిప్పుకునే సమ్మోహనత్వం తో పాటు  ఆ పాత్రలకు తన నటనతో విస్త్రుతి పెంచేందుకు ప్రయత్నం చేసేది.   వసంత కోకిల (హిందీ లో సద్మా) లో శ్రీ అభినయానికి సలాం చెప్పని వారెవ్వరు. కమల హాసన్తో పోటీ పడి తన పాత్రతో, కథానాయకుడిని, అతని జీవిత  లక్ష్యాన్ని నడిపించి చివరికి కథగా, కల్పనగా మిగిలిపోయిన వైనం  ఎలా మరిచిపోగలం. ఆకలి రాజ్యం లో విలాసవంతమైన జీవితాన్నికాదని ఒక ఆవేశపరుడు, అసమర్థుడిగా ఉన్న కథానాయకుడిని ఇష్టపడి అతని కోసం నడిచివచ్చే సీన్, బొమ్మలు గీసే మూగవాని పాత్ర ఆక్సిడెంట్ లో చనిపోయినపుడు మోహంలో పలికించిన ఎక్స్ప్రెషన్స్ ఇంకెక్కడా  చూడలేం .  తెలుగు సినిమా, ఆ మాటకొస్తే తానను  స్టార్ గా మార్చిన బాలీవుడ్ సినిమా శ్రీదేవి నట కౌశలాన్ని పూర్తిగా వెలికి తీసే పాత్రల్ని సృష్టించగలిగాయా అనేది అనుమానమే. ‘బిజిలీ గిరానే మైహూ ఆయే‘ అని ఒక పాటలో  నర్తించినట్టు ఆమె మెరుపుల్ని కిందకి దించగలదు.

ఒక నలిగిపోయిన కాన్సెప్ట్ తో అప్పట్లో రీమేక్ అయినా  చాల్ బాజ్ లో అయినా రెండు పాత్రల్ని అవలోకగా ఎటువంటి పోలికలు తీయలేనట్టుగా  గుక్క తిప్పనివ్వని నటన. హిమ్మత్ వాలా లో జితేంద్ర సరసన నటించినా, చాందిని చిత్రం లో రుషి కపూర్ పక్కన నటించినా, లమ్హే. మిస్టర్ ఇండియా లో అనిల్ కపూర్ పక్కన అయినా ప్రతి హీరో కలల రాణి ఆమే. నగీనా లో అమ్రిష్ పూరి నాదస్వరం ఊదినపుడు కోపంగా బుసలు కొడుతూ మెలికలు తిరుగుతూ  చేసిన పాము నృత్యం ఇప్పటికి ఒక నమూనా. కమర్షియల్ ఫార్ములా ని విడిచిపెట్టి ఎందుకో ఆమె కోసం పారలల్ పాత్రల రూపకల్పన జరగలేదు. అయినా శ్రీదేవిని  లేడీ సూపర్ స్టార్ గా పిలిచేవాళ్ళు. తెలుగు సినిమా అయితే మరీ ఆమెను వృద్ధ కథానాయకుల పక్కన వారి వయసుని దాచేందుకు ఒక గ్లామర్ బొమ్మగా మార్చేసింది. అయినా ఎక్కడా తొణకని విశిష్టమైన వ్యక్తిత్వo.  ఆమె ఒక పాన్ ఇండియన్ సూపర్ స్టార్ . అందుకేనెమో  90 ల్లో స్పెవెన్ స్పిల్  బర్గ్  తన చిత్రం లో నటించమని అడిగాడట. బాలీవుడ్లో, టాలీవుడ్లో బిజీగా ఉంది ఆ అవకాశాన్ని అందుకోలేక పోయింది కానీ లేకపోతే ఆ సమ్మోహన రూపాన్ని, జలపాతాన్ని తలపించే నటనని ప్రపంచం మొత్తం చేసి ఉండేది.

ఎందరికో కలల రూపం మరెందరికో విపరీత వాంఛల రూపం అయినా సరే తన జీవితం తన చేతిలో లేదు. చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాఒక  సొంత వ్యక్తిత్వం లేక జీవితం లో తోడుకోసం అల్లాడిన ప్రాణం శ్రిదేవిది.  తల్లి చనిపోయిన తరువాత ఇద్దరు పిల్లకు తండ్రి అయిన బోని  కపూర్ కి  రెండో భార్యగా సినిమా ప్రపంచాన్ని కాదని వెళ్ళినప్పుడు  కాకి ముక్కుకు దొండపండు లాంటి  కామెంట్లు ఎందరు ఎన్ని చేసినా తోడు కోసం తనను కోరుకున్న వాడి కోసం నిజాయితీగా అడుగులు వేసింది. 50 ఏళ్ళ వయసులో ఇంగ్లీష్ వింగ్లిష్ చిత్రంలో ముడుచుకుపోయే మధ్యతరగతి యువతిగా, నిర్లక్ష్యానికి గురయ్యే  తల్లిగా, భార్యగా,  చివరకు తనని తాను వ్యక్తపరిచే సమయంలో అయినా అద్భుత త్యాగమూర్తిగా  భారతీయ స్త్రీ  వ్యకిత్వన్ని, తెరపై పండించినప్పుడు అది అంతే  సహజంగా అనిపించింది.

శ్రీదేవి భారత జాతి కుదించిన ఒక అద్భుత సజీవ  శిల్పం. ఇద్దరు పిల్లకు తల్లిగా భర్తను, పిల్లలను తన వెనుక తీసుకెళుతున్నప్పుడు కుటుంబ కట్టుబాట్లను తెంచుకోలేని నిస్సహాయత పాటు   ఒక అద్భుత  ప్రతిభ దాగున్న స్త్రీమూర్తి లాగే కనిపించేది.  చివరి సినిమా మామ్ లో మారు తల్లిగా బిడ్డను కాచిన వైనం, తన బిడ్డపై జరిగిన ఘోరం గురించి తెలిసినప్పుడు మొహం లో పలికించిన వణుకు,  హావభావాలు నటనలో ఇప్పటివరకు ఉన్న అన్ని పరిమితుల్ని చెరిపేస్తుంది. ప్లాస్టిక్ మొహాలను  కాస్మెటిక్ అందాలను చీల్చుకుని విరుచుకు పడే తుఫాను నటన అది.  ఎంత మేకప్ వేసినా  రాని కోమలత్వం, ఎంత మూతి ముడిచినా  సుకుమారత్వం, ఎన్ని స్కూల్ ల లో ట్రైన్ అయినా రాని సహజాతం, ఎంత మంది ఎన్ని రకాలుగా చేతులు,  కాళ్లు,  నడుమూ ఊపేసిన రాని హొయలు ఆమె సొంతం.

ఎన్ని వందల చిత్రాలు చేసినా శ్రీదేవిని ఒక అతిలోక సుందరిగానో లేక అందమైన అతిశయంగానో , పువ్వులు, పండ్లు మధ్య కుట్టేసిన  వెండితెర పరిమితిని దౌర్భాగ్యాన్ని నిరసిస్తూ ఆమె జీవితం లాగే ఆమె వెండితెర మీద కనిబరిచిన నటన  పరిమితమైనది.  దాగివున్న, వెలికి రాకుండా ఉండిపోయిన  ప్రతిభ మాత్రం అనన్యసామాన్యం. ఆమె అందుకోలేక పోయిన సగం ఆకాశం మిగిలే ఉంది. శ్రీదేవికి శిరస్సు వంచి నీరాజనాలు.