శ్రీకాకుళంలో దొరికిన ‘పాక్ ఉగ్రవాది’ చిత్తూరువాసి!  - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీకాకుళంలో దొరికిన ‘పాక్ ఉగ్రవాది’ చిత్తూరువాసి! 

January 14, 2020

విశాఖలో రిపబ్లిక్ డే వేడులు నిర్వహించనున్న నేపథ్యంలో పాకిస్తాన్ అనుమానిత ఉగ్రవాదులు శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించడం కలకలం రేపుతోంది. ప్రధాన నిందితుడితోపాటు నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్యంగా విచారణ జరుపుతున్నారు. అసలు వీరు ఏ ఉద్దేశంతో వచ్చారు? ప్రశాంతంగా ఉండే ఏపీలో అలజడి సృష్టించడానికి ఎందుకు సిద్ధమయ్యారనే కోణంలో ప్రశ్నిస్తున్నారు. పాక్ ఉగ్రవాదిగా భావిస్తున్న అష్రాఫ్ చిత్తూరుజిల్లా పలమనేరు వాసి అని గుర్తించారు. అతనితోపాటు అరెస్టయిన ముగ్గురిని ఆలీ, సయాద్ హసిం, షాజహాన్ గా గుర్తించారు. అష్రాఫ్ పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ తరఫున రిక్రూట్‌మెంట్ కోసం వచ్చి ఉంటాడని భావిస్తున్నారు. అయితే పోలీసులు దీనిపై దీనికి సంబంధించిన వివరాలు పూర్తిగా చెప్పడం లేదు. వీరికి ఉగ్రవాదులతో లింకులు ఉన్నట్లు తమకింకా తెలియడం లేదని, ఓ హత్య కేసులో అరెస్ట్ చేశామని చెబుతున్నారు. 

ఇలా చిక్కారు.. 

ముంబై నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్తున్నటొమాటల లారీ డ్రైవర్ ఇటీవల హత్యకు గురయ్యారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తుండగా ఉగ్రవాద హస్తం బయటపడింది. అజ్ఞాత వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి, ఐఎస్‌ఐ ఏజెంట్‌ శ్రీకాకుళం జిల్లాలోకి చొరబడినట్లు ఉప్పందిచారు. ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగి, విశాఖ పోలీసులను అప్రమత్తం చేశారు. నిందితులను శ్రీకాకుళం జిల్లా కంచిలి వద్ద తనిఖీల్లో అరెస్ట్ చేశారు.

ఆ ఫోన్ కాల్ వల్లే 

నిందితులకు పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధమూ లేదని, వారి తమకు తెలియకుండానే కేసులో చిక్కుకున్నారని పలమనేరు లారీ అసోసియేషన్ రాష్ట్రస్థాయి సెక్రటరీ జిలాని చెప్పారు. ‘ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ కాల్ చేసుకుంటాని అడగడంతో అష్రాఫ్ అతనికి ఫోన్ ఇచ్చాడు. ఆ వ్యక్తి పాకిస్తాన్ లోని ఓ నంబరుకు ఫోన్ చేశాడు. అందుకే వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మా డ్రైవర్ పొరపాటు చేశాడు, అతని వదలేయండి.. ’ అని కోరారు.