ముష్కరుల దాడిలో శ్రీకాకుళం జవాన్ వీరమరణం - MicTv.in - Telugu News
mictv telugu

ముష్కరుల దాడిలో శ్రీకాకుళం జవాన్ వీరమరణం

October 23, 2020

baburao

దేశవ్యాప్తంగా ముష్కరుల ఏరివేత కొనసాగుతోంది. ఇంటలిజెన్స్ అధికారులు అందిస్తున్న సమాచారం మేరకు భద్రతా దళాలు, పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎదురుపడిన ఉగ్రవాదులను అరెస్ట్ చేస్తున్నారు. కొందరు ఉగ్రవాదులు లొంగిపోతున్నారు. అయితే కొన్ని సార్లు ఉగ్రవాదులు జరుపుతున్న దాడుల్లో భద్రతా దళాలు, పోలీసులు అమరులవుతున్నారు. 

తాజాగా అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఖోన్సా సరిహద్దు సమీపంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన జవాను బొంగు బాబూరావు(28) అమరుడయ్యాడు. వజ్రపుకొత్తూరుకు చెందిన బాబూరావు అసోం రైఫిల్స్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం 1.40 గంటలకు బాబూరావు భౌతికకాయం విశాఖపట్టణం విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడి నుంచి శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ చేరుకోగా స్థానిక యువకులు అక్కడి నుంచి అక్కుపల్లి మీదుగా ర్యాలీగా స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఈరోజు ఉదయం సైనిక లాంఛనాలతో బాబూరావు అంత్యక్రియలు జరుగనున్నాయి. బాబూరావుకు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పెళ్లి అయింది.