ఈజిప్టులో ఆంధ్రప్రదేశ్ వాసికి ఉరిశిక్ష.. కాపాడాలంటూ..   - MicTv.in - Telugu News
mictv telugu

ఈజిప్టులో ఆంధ్రప్రదేశ్ వాసికి ఉరిశిక్ష.. కాపాడాలంటూ..  

November 22, 2019

Srikakulam person hanging Sentenced in Egypt

శ్రీకాకుళం జిల్లా వాసికి ఈజిప్టులో ఉరిశిక్ష ఖరారైంది. అతని  పడవలో మాదక ద్రవ్యాలు దొరకడంతో ఈ శిక్ష పడింది. శ్రీకాకుళం రూరల్ మండలం చంద్రయ్యపేటకు చెందిన బగ్గు రమణ ఈజిప్టులో సీమెన్‌గా పని చేస్తున్నాడు. 2016 డిసెంబర్ 18న రమణ పనిచేస్తున్న షిప్‌లో మాదక ద్రవ్యాలు దొరకాయి. దీంతో అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటర్‌ వరకు చదువుకున్న రమణ విశాఖలోని ఎస్‌కేడీ కంపెనీకి చెందిన వర్మ అనే ఏజెంట్‌ ద్వారా విదేశాల్లో సీమెన్‌గా పనిచేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.  

ఏజెంటుకు రూ.4 లక్ష లు చెల్లించి 2016 సెప్టెంబరులో ముంబాయి నుంచి ఇరాన్‌కు విమానంలో వెళ్లాడు. అక్కడ ఏజెంట్‌తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు అబ్బాన్‌ సిరదౌసీ కంపెనీకి చెందిన షిప్‌లో సీమెన్‌గా చేరాడు. అతను వెళ్తున్న షిప్‌ను అక్కడి పోలీసులు తనిఖీ చేయగా నిషేధిత మాదక ద్రవ్యాలు దొరికాయి. దీంతో పోలీసులు  రమణను అరెస్ట్‌ చేశారు. విచారణ జరిపిన అనంతరం అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధించినట్టు తెలిస్తోంది. 

అయితే రమణ విదేశాలకు వెళ్లిన నాటి నుంచి ఆయన ఆచూకీ లేదు. సంబంధిత ఏజెంటును ప్రశ్నిస్తే అతడు పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూలైలో కుటుంబసభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏపీ పోలీస్‌ ఎన్నారై విభాగం నుంచి ఒక సమాచారం వచ్చింది. రమణకు ఈజిప్ట్‌ కోర్టు ఉరిశిక్ష విధించినట్టు తెలిసింది. ఈ విషయం తెలిసి రమణ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు ద్వారా… విదేశాంగ మంత్రిని కలిసి ఈజిప్టు ప్రభుత్వంతో మాట్లాడాలని వినతిపత్రం సమర్పించారు. ఆయన స్పందించి గురువారం బాధిత కుటుంబ సభ్యులను తీసుకెళ్లి విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఇందులో రమణ తప్పు లేదని..సంబంధిత షిప్‌ యాజమాన్యం చేసిన తప్పిదానికి రమణ ఇరుక్కున్నాడని ఎంపీ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అక్కడి రాయబార కార్యాలయంతో మాట్లాడి బాధితుడికి తిరిగి దేశానికి రప్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్టు ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ఫోన్‌లో తెలిపారు.