అసురన్ తెలుగు రీమేక్‌ దర్శకుడు ఈయనే.. - MicTv.in - Telugu News
mictv telugu

అసురన్ తెలుగు రీమేక్‌ దర్శకుడు ఈయనే..

November 18, 2019

Srikant Addala For Asuran telugu Remake

ఇటీవల విడుదల అయిన ‘అసురన్’ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. సినిమా చూసినవాళ్లంతా చాలా బాగుందని, వాస్తవికతకు అద్దం పడుతోందని, దివంగత రచయిత కేశవరెడ్డి నవలలు చదివిన అనుభూతి కలుగుతోందని చాలామంది తమ అనుభవాలను వెలిబుచ్చారు. ధనుష్, వెట్రిమారన్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ దసరా కానుకగా అక్టోబర్ 4న విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ భావిస్తోంది. ఇందులో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.

తమిళ నిర్మాత, వి. క్రియేషన్స్ బ్యానర్‌ అధినేత కలైపులి థాను, సురేష్ ప్రొడక్షన్స్‌‌తో కలిసి నిర్మించనున్నారు. మరి ఈ చిత్రానికి దర్శకత్వం ఎవరు వహిస్తారు అన్న సందేహం నెలకొంది. దీనిపై నిర్మాత సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. ‘కొత్త బంగారు లోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ముకుంద’ సినిమాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ‘అసురన్’ తెలుగు రీమేక్‌కు దర్శకత్వం వహిస్తారని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తెలుగు నేపథ్యానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసి చిత్రాన్ని రీమేక్ చేస్తామని తెలిపారు. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి హీరో చేసే ప్రయత్నం ఆకట్టుకుంటుంది.. గతంలో ఇలాంటి పాయింట్‌తో  ‘జయంమనదేరా’ సినిమా వచ్చిందని అన్నారు. శ్రియ కథానాయికగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పారు. కాగా, తొలుత ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తారనే మాటలు వినిపించిన విషయం తెలిసిందే.