మలిదశ తెలంగాణ ఉద్యమ అమరవీరుడు శ్రీకాంతాచారి తండ్రి కాసోజు వెంకటచారి అదృశ్యమయ్యాడు. ఈ మేరకు ఆయన భార్య శంకరమ్మ శనివారం హయత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హయత్నగర్ పరిధిలోని సూర్యనగర్ కాలనీ రోడ్డు నంబర్-8లో వెంకటాచారి ఆయన భార్య శంకరమ్మ కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నారు. ఇటీవల వెంకట చారి ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఈ నెల 1న పనిమీద బయటికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన వెంకటచారి తిరిగి రాలేదు. 2వ తేదీన సోషల్ మీడియా ద్వారా అతను ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ వద్ద ఉన్నట్లు గుర్తించామని, ఆ తర్వాత పలుమార్లు ఫోన్ చేసినా సమాధానం లేదని శంకరమ్మ పోలీసులకు వెల్లడించింది. తన భర్త కేఏ పాల్ వద్ద ఆశ్రయం పొందుతున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తూ శంకరమ్మ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తండ్రికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాంతాచారి తండ్రి గెలిచి, మంత్రిగా అసెంబ్లీలోకి అడుగుపెడతారని వెల్లడించారు.