బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీ నాలుగు టెస్ట్‌ల సిరీస్ భాగంగా.. భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు టెస్ట్‌లు ముగిశాయి. మొదటి రెండు టెస్ట్‌ల్లో టీం ఇండియా విజయం సాధించింది. మూడో టెస్ట్‌లో మాత్రం కంగారులు సత్తా చాటారు. ఈ మూడు టెస్ట్‌లు మూడు రోజుల్లోనే ముగియడం విశేషం. ఇక నాలుగో టెస్ట్ మార్చి 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ దక్కించుకోవాలని భారత్ భావిస్తోంది. మూడో టెస్ట్‌లో చేసిన తప్పులను సరిదిద్దుకునే పనిలో ఆటగాళ్లు నిమగ్నమయ్యారు. అదేవిధంగా నాలుగో టెస్ట్ కోసం సరికొత్త ప్రణాళికలు సిద్ధంచేస్తోంది టీం ఇండియా. జట్టులో మార్పులు చేయాలని భావిస్తోంది. మూడు టెస్ట్‌ల్లో పెద్దగా ప్రభావం చూపని కీపర్ శ్రీకర్ భరత్ స్థానంలో యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషాన్‌ను తుది జట్టులో తీసుకోనున్నారు.
రిషబ్ పంత్ గైర్హజరి నేపథ్యంలో ఆసీస్‌తో టెస్ట్ సిరీస్ కు ఎంపికైన తెలుగు తేజం శ్రీకర్ భరత్ అంచనాలను అందుకోలేకపోయాడు. వికెట్ల వెనుక రాణించినా బ్యాటింగ్‌లో మాత్రం తీవ్రంగా నిరాశపర్చాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 57 పరుగులు మాత్రమే సాధించాడు. వరుసుగా 8,6,23*,17,3 చేశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే అవకాశం వచ్చినా భరత్ వినియోగించుకోలేకపోయాడు. దీంతో అతడిపై వేటు పడే అవకాశం ఉంది. శ్రీకర్ భరత్ తో పాటు జట్టులో మరో మార్పు జరిగే అవకాశం ఉంది.మూడో టెస్ట్‌కు దూరమైన షమీ జట్టులోకి రానున్నాడు. నాలుగో టెస్ట్‌లో సిరాజ్‌కు విశ్రాంతి ఇవ్వనున్నారు.