శ్రీకృష్ణ, ముసద్దీలాల్ జ్యువెలర్స్‌కు డబ్బులు ఊరికే వస్తాయి! - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీకృష్ణ, ముసద్దీలాల్ జ్యువెలర్స్‌కు డబ్బులు ఊరికే వస్తాయి!

May 7, 2019

‘డబ్బులు ఎవరికీ ఊరికే రావు..’ తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల హిట్టయిన డైలాగుల్లో ఒకటి. సినిమాల్లోది కాదు, టీవీ షోల్లోదీ కాదు. ఓ గుండాయన తన ప్రచారం కోసం కొట్టింది. కస్టమర్లకు డబ్బులు ఎలా వస్తున్నాయో పక్కనబడితే జ్యెయెలరీ కంపెనీలకు మాత్రం కష్టపడకుండానే వచ్చేస్తున్నాయని అర్థమవుతోంది.

Srikrishna Jewellers owners fraud case revenue intelligence officials of Directorate of Revenue Intelligence (DRI) are quizzing the Srikrishna Jewellers MD Pradeep Kumar and his son Sai Charan

ధర్మాలాభం లేదు కాబట్టి..

వ్యాపారం అంటే మోసం. వడ్డీల్లో ధర్మవడ్డీ అనేది ఒకటుంది. కానీ లాభాల్లో ధర్మలాభం అనేదేమీ లేదు. సో, దొరికిన దారిలో కొంత కూడబెట్టుకోక తప్పదు. 99 శాతం లాభం వస్తే మరీ మంచిది. పైగా అవి జ్యుయెలరీ సంస్థలు. జీఎస్టీ, మజూరు, రాళ్లురప్పలని నానా పేర్లతో మొదట కస్టమర్ నుంచి ఎంత గుంజాలో అంత గుంజేస్తారు. తర్వాత కంపెనీ ఆడిటర్ గోల్మాల్ నైపుణ్య ప్రదర్శన, అటు పిమ్మట, పన్ను ఎంత కట్టాలనే దానిపై కంపెనీ యజమాని తీసుకునే  నిరంకుశ నిర్ణయాన్ని బట్టి సర్కారు ఖజానాకు వారికి ఎంతోకొంత ముడుతుంది.

కానీ అది కూడా ఎందుకు కట్టాలని అని కొన్ని జ్యుయెలరీ సంస్థలు తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నాయి. మీరు హైదరాబాద్ నగరంలో తిరిగే వాళ్లయితే శ్రీకృష్ణ జ్యెయెలర్స్ దుకాణాలు కనిపిస్తుంటాయి. ముసద్దీలాల్ జ్యెయెలర్స్ కూడా. కానీ సామాన్యులకు వాటితో పెద్దగా పనుండదు. ఆ తాహతు ఉన్నవాళ్లే వెళ్తుంటారు. చిల్లర లెక్కలు అవీ పెద్దగా లెక్కల్లోకి రావేమో వాళ్లకు. కానీ ఆ కంపెనీలకు మాత్రం లెక్కలు లేక్కలే. అందుకే కోట్ల పన్నులు ఈజీగా ఎగ్గొశాయి అంటున్నారు దర్యాప్తు అధికారులు.

శ్రీకృష్ణ జ్యువెలర్స్ ఎండీ ప్రదీప్ కుమార్ భారీగా పన్ను ఎగ్గొట్టారంటూ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఈ రోజు అరెస్ట్ చేశారు. బాగోతానికి సహకరించాడని అతని కొడుకు సాయిచరణ్‌ను కూడా పట్టుకున్నారు. శ్రీకృష్ణ కంపెనీకి దేశంలో 35 చోట్ల కంపెనీలు ఉన్నాయని, వాటిలో సోదాలు చేసి ఎగవేతలను పసిగట్టామని చెబుతున్నారు. కొన్నాళ్ల కిందట ముసద్దీలాల్‌ జ్యుయెలర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పైనా దాడుల జరిగాయి. రూ. 82.11 కోట్ల విలువైన 145.89 కిలోల బంగారాన్ని జప్తు చేశారు. పెద్దనోట్ల రద్దు సమయంలో తమ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోడానికి బంగారాన్ని పావుగా వాడుకున్నారని అభియెగాలు నమోదు చేశారు. కల్యాణ్ జ్యుయెర్స్‌లో నగల తూకం తక్కువగా ఉన్నట్లు అప్పట్లో అల్లరైంది.

ఎలా సాధ్యం?

ఆడిటర్ తలచుకుంటే ఆదాయానికి కొదవా అన్నట్లు సాగుతోంది వ్యవహారం. ఇంత పకడ్బందీ రసీదుల వ్యవస్థ ఉన్నా ఆడిటర్ల చేతివాటం కొన్నింటిని మాయం చేయడం, కొన్నింటి తారుమారు చేయడం సర్వసాధారణం. కొనుగోలుదారులకు అసలు బిల్లులు చూపించి, రికార్డులో దొంగబిల్లులు చూపుతున్నారు. స్టాక్ రిజిస్టర్ మరో పెద్ద గోల్మాల్ వ్యవహారం. దీనికి తోడు దొంగబంగారంతో మరింత లాభం. దొంగబంగారం అంటే నకిలీ బంగారం కాదు, అసలు బంగారమే. బ్లాక్ మార్కెల్లో తక్కువ ధరకు కొని, నగలుగా మార్చి అమ్మే కనకం. కస్టమ్స్, ఐటీ, జీఎస్టీ వంటి యంత్రాంగాలకు దొరక్కుండా, దొరికినా ఆయా అధికారులను మేనేజ్ చూస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. విషయం ఎక్కడో లీక్ కావడం, అధికారులు బదిలీ కావడం, నిజాయతీ అధికారులు వచ్చేయడంతో బంగారు కథలు కంచికి చేరుతున్నాయి.

శ్రీకృష్ణ, కల్యాణ్, త్రిభవన్‌దాస్ భీమ్‌జీ జవేరీ..  పేరు ఏదైనా లోలోపల జరిగే వ్యవహారాలు అంత సులువుగా బయటపడవు. కల్యాణ్ జ్యయెలర్స్‌లో అక్కినేని నాగార్జున, అమితాబ్ బచ్చన్, అనుష్కలకు వాటాలు ఉన్నాయని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అవి నిజం కావొచ్చు, అబద్ధం కావొచ్చు. కానీ వాళ్లు చిక్కుల్లో పడకుండా ‘తగిన జాగ్రత్తలు’ తీసుకుంటుంటే అంతే చాలు!!