శ్రీలంక పేస్ బౌలర్ లసిత్ మలింగ నోటి దులాతో చిక్కుల్లో పడ్డాడు. ఆ దేశ క్రీడా మంత్రిని కోతి అని తిట్టడం వివాదాస్పదమైంది. దీన్ని సర్కార్ సీరియస్ గా తీసుకోవడంతో మలింగ విచారణకు హాజరయ్యాడు. చాంపియన్స్ ట్రోఫీ సెమీస్ చేరడంలో విఫలమైన శ్రీలంక టీమ్‌పై ఆ దేశ క్రీడామంత్రి దయసిరి జయశేఖర విరుచుకుపడ్డారు. లంక క్రికెటర్లు పొట్టలు పెంచుకొని చాలా లావుగా తయారయ్యారని, ఇలా ఉంటే క్రికెట్ ఎలా ఆడతారని మండిపడ్డారు. దీనిపై లసిత్ మలింగ స్పందించాడు. ఏసీ రూముల్లో కూర్చొని చేసే ఈ విమర్శలను నేను పట్టించుకోను. చిలుక గూటి గురించి కోతులకు ఏం తెలుసు? ఇది చిలుక గూటిలోకి కోతులు వచ్చి దాని గురించి మాట్లాడినట్టు ఉంది అని మలింగ కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలను జయశేఖర సీరియస్‌గా తీసుకున్నారు.
శ్రీలంక క్రికెట్ బోర్డుతో ఉన్న ఒప్పందాన్ని ఉల్లంఘించేలా మలింగ వ్యాఖ్యలున్నాయని, అందుకే విచారణకు ఆదేశించినట్లు ఆయన చెప్పారు. మలింగ ఒక్కన్నే తిట్టలేదని, ప్లేయర్సందరినీ కలిపి విమర్శిస్తే.. అతనికెందుకంత ఉలుకు అని అన్నారు. పొట్టలు ఉండటం వల్లే లంక ప్లేయర్స్ ఫీల్డ్‌లో ఈజీగా కదల్లేకపోయారని, క్యాచ్‌లు నేల పాలు చేశారన్నారు జయశేఖర. పాక్‌తో మ్యాచ్‌లో ఆ టీమ్ కెప్టెన్ సర్ఫరాజ్ క్యాచ్‌ను రెండుసార్లు డ్రాప్ చేసి శ్రీలంక భారీ మూల్యమే చెల్లించిందన్నారు. మంకీ వివాదం మలింగ ఎలా బయటపడుతాడో చూడాలి.