Srinivas Reddy came to the karim nagar court in burkha
mictv telugu

కేసు పెట్టిన భార్య.. భయంతో బురఖాలో వచ్చిన భర్త

July 28, 2022

కరీంనగర్ కోర్టు ఆవరణలో బుధవారం కలకలం రేగింది. కేసు నిమిత్తం కోర్టుకు వచ్చిన ఓ వ్యక్తి బురఖాలో రావడం అక్కడున్న వారందరినీ అవాక్కయ్యేలా చేసింది. అతని తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పూర్తి వివరాల్లోకెళితే.. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామానికి చెందిన పల్లె శ్రీనివాస్ రెడ్డికి భార్యతో గతంలో గొడవలు వచ్చాయి. దాంతో అతడిపై భార్య 2000 సంవత్సరంలో వరకట్న వేధింపుల కేసు వేసింది. కేసు విచారణ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి కోర్టుకు పలుమార్లు రాకపోవడంతో న్యాయస్థానం అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో వారెంట్లు రద్దు చేసుకునేందుకు శ్రీనివాస్ రెడ్డి కోర్టుకు రాగా, ఎవరికీ కనిపించకుండా బురఖా వేసుకొని వచ్చాడు. అక్కడున్న పోలీసులు గుర్తించి మారువేషంలో ఎందుకొచ్చావని ప్రశ్నించగా, గట్టిగా కేకలు వేసుకుంటూ నాపై దౌర్జన్యం జరుగుతోందంటూ కోర్టు హాల్‌లోకి వెళ్లాడు. అతని తండ్రి మల్లారెడ్డి వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించడంతో అక్కడున్న వారు వెంటనే స్పందించి అడ్డుకున్నారు. అనంతరం మల్లారెడ్డిని ఆస్పత్రికి తరలించారు. అటు శ్రీనివాస్ రెడ్డి లాయర్లు అరెస్ట్ వారెంట్‌ను కోర్టు ద్వారా రద్దు చేసి పిటిషన్‌ను మంజూరు చేయించారు. నాటకీయ పరిణామాల మధ్య జరిగిన ఈ సన్నివేశం కక్షిదారులు,  న్యాయవాదులను ఆందోళనకు గురి చేశాయి.