శ్రీరెడ్డి నగ్నపోరాటంలో న్యాయముంది.. ఇకనైనా మారండి! - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీరెడ్డి నగ్నపోరాటంలో న్యాయముంది.. ఇకనైనా మారండి!

April 7, 2018

శ్రీరెడ్డి.. రెండు మూడు సినిమాలే చేసినా తెలుగునాట అందరికీ సుపరిచితమైన పేరు. అన్యాయంపై, ఆడశరీరాల దోపిడీపై ఆమె సాగిస్తున్న అలుపెరుగని పోరాటం అందరినీ ఆలోచింపజేస్తోంది. టాలీవుడ్‌లో ఇలాంటి అన్యాయాలు చాలా మామూలే అని అందరికీ తెలుసు. అయినా ఎవరూ నోరువిప్పలేదు ఇంతవరకు. అందరూ గప్‌చుప్‌.. అందరిదీ తిలాపాపం తలా పిడికెడు.. ఈ అన్యాయాన్ని శ్రీరెడ్డి ప్రశ్నించింది. తానొక్కటే వెయ్యిమంది ఉద్యమకారుల్లా మారిపోయి అలజడి సృష్టిస్తోంది. పైపై మెరుగుల, మర్యాదల వలువల్ని లాగిపారేసి నిప్పులాంటి నిజం చూపించడానికి తన పరువు మర్యాదలనే పణంగా పెట్టింది ఈ ఆడపులి!

అన్యాయాల చిట్టా..

ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్లలో నూటికి 99 మంది నాన్ లోకలే. కాజల్, తమన్నా, సమంత, రకుల్, రాశీఖన్నా, అనుష్క, సాయిపల్లవి, నయనతార.. వంటివారికే మన నిర్మాతలు పెద్దపీటలు వేస్తున్నారు. తెల్లతోలు, కాస్త సోషల్ మూవింగ్, ఎలీట్ లుక్, తళుకుబెళుకులు, ముద్దుముద్దు పలుకులు ఉంటే చాలు ‘బుక్’ చేసుకుంటున్నారు. కానీ తెలుగు అమ్మాయిలవైపు కన్నెత్తి చూడ్డం లేదు. చెప్పుకోదగ్గ ఒకే ఒక తెలుగు హీరోయిన్ అంజలి. ఆమె పేరు మినహాయిస్తే టావీవుడ్‌లో లోకల్ పిల్లలు దీపం పెట్టి వెతికినా కనిపించారు. చక్కని కనుముక్కు తీరు ఉన్నా, నటనలో సత్తా ఉన్నా నై జాన్తా. తెల్ల ఒళ్లు, తాము చెప్పిన పని చేసే అణుకువ, ఒద్దిక ఉంటేనే చాన్స్. అదికూడా అటు పైనుంచి వచ్చిన ఉత్తరాది, ఇటు కింది నుంచి వచ్చిన మలయాళ, తమిళ, కన్నడ కుట్టిలకే. ఏపీ, తెలంగాణ యువతులను జనం ‘చూడరని’ ఒక దరిద్రపు ఆలోచన..

తెలుగు అమ్మాయిలు ఒప్పుకోరు..

శ్రీరెడ్డి చెబుతున్నట్లు తెలుగు అమ్మాయిలను సినిమాల వాళ్లు వాడుకుని వదిలేస్తున్న ఉదాహరణలు చాలానే ఉన్నాయి. బాధితులు వందలు, వేలల్లోనే. హీరోయిన్ అవుదామనే ఆశతో చిత్రపురికి వచ్చి భంగపడిన ఏ తెలుగు ఆడబిడ్డను కదిలించినా విషాదాలు కన్నీళ్లు పెట్టిస్తాయి. చాన్స్ ఇస్తామంటూ చాన్స్ తీసుకుని, తర్వాత మొహం చాటేసే బాపతే ఎక్కువ. మరో రకం దోపిడీ కూడా ఉంది. హీరోయిన్ పాత్ర అని ఊరించి, తర్వాత చిన్నాచితకా, గ్రూప్ డ్యాన్స్ పాత్రలతో మభ్యపెట్టడం, అవసరం ఉన్నంతవరకు వాడుకుని వదిలేయడం. ఈ ఘోరాలను భరించలేని తెలుగు అమ్మాయిలు మౌనంగా కనుమరుగు అవుతున్నారు.

కమిట్ మెంట్‌కు ఒప్పుకోని వారు మొత్తం సినిరంగానికే వీడ్కోలు పలికి పెళ్లిళ్లు చేసుకుని సెటిలైపోతున్నారు. అందచందాలు, నటనాపటిమ ఉన్న ఇలాంటి ఎంతోమందిని సినీపరిశ్రమ కోల్పోవడం విషాదం. గతంలో దేవిక, చంద్రకళ, ముచ్చర్ల అరుణ వంటి తారలు సినీనేపథ్యం నుంచి వచ్చేవారు. ఇప్పుడు రాకపోవడానికి కారణమేంటో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. కొందరు సెలబ్రిటీల కూతుళ్లు వస్తున్నా, వారి హోదా గొప్పగా ఉండడంతో ‘కమిట్ మెంట్’ వంటి వుండే ప్రసక్తే లేదు. సాధారణ, మధ్యతరగతి అమ్మాయిలపై అఘాయిత్యాలన్నీ.

తెలుగువారికి చేతకాదన్న వాదన అబద్ధం..

తెలుగు అమ్మాయిలకు నటన రాదని, అందచందాలు వుండవని, అందుకే పరాయివారిని తీసుకుంటున్నామని కొందరు చేస్తున్న వాదనలో ఏమాత్రం పస లేదు. ఇంద్రజ, రవళి, రంభ, స్నేహ, లయ వంటి అమ్మాయిలంతా తెలుగురారే. చక్కని రూపంతో, నటనతో అలరించినవారే. హిట్లు అందించిన వారే. తర్వాత వచ్చిన కలర్స్ స్వాతి, తేజస్విని(ఐస్ క్రీమ్), చాందినీ చైదరి(లండన్ బ్రడ్జి), జెన్నీ హన్నీ(శ్రావ్య) వంటి వారూ ప్రతిభావంతులే. అయితే ‘దరిద్రపు’ కారణాలతో టాలీవుడ్‌లో అవకాశాల్లేక  పరభాషా పరిశ్రమలపైపు వెళ్లిపోతున్నారు. కొందరు శాశ్వతంగా వెండితెరకు దూరమవుతున్నారు. పరాయి రాష్ట్రాల తారలకు చాన్సులు ఇవ్వడంతో తప్పులేదు. ప్రతిభ ఎక్కడ ఉన్నా ప్రోత్సహించాల్సిందే. కానీ కేవలం తెల్ల ఒళ్లు, అణుకువ, ప్రచారయావ వంటి పనికిమాలిన కారణాలతో స్థానిక యువతులను పక్కనపెట్టడమే నేరం. కాంచనమాల, కన్నాంబల నుంచి అంజలి, భానుమతి, సావిత్రి, జమున, షావుకారు జానకి, కృష్ణకుమారి వరకు.. లక్ష్మి, వాణిశ్రీ, శారద, విజయనిర్మల, జయసుధ, జయప్రద, మాధవి, శ్రీదేవి నుంచి విజయశాంతి, భానుప్రియ, ఆమని, గౌతమి వరకు.. ఎందరో తెలుగు అమ్మాయి టాలీవుడ్ తెరను సుసంపన్నం చేశారు. చక్కని రూపంతోపాటు చక్కని వాచకంతో, అపురూపమైన నటన ప్రదర్శించి ఆకట్టుకున్నారు. వారందర్నీ ఆనాడు మన నిర్మాతలు దర్శకులు.. వివక్షతో దూరం పెట్టి వుంటే టాలీవుడ్ లో స్వర్ణయుగాలు వుండేవి కావు. అందుకే శ్రీరెడ్డి పోరాటంలో నిజం ఉంది, న్యాయం ఉంది. ఇక మారాల్సిందెవరో చెప్పాల్సిన పనిలేదు.