శ్రీశైలం డ్యామ్‌కు ముప్పు.. ఇదీ వాస్తవ పరిస్థితి  - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీశైలం డ్యామ్‌కు ముప్పు.. ఇదీ వాస్తవ పరిస్థితి 

November 21, 2019

Srisailam ...

తెలుగు రాష్ట్రాలను సస్యశ్యామం చేస్తూ, విద్యుత్ కాంతులు నింపుతున్న శ్రీశైలం డ్యాం భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. డ్యాంకు మరమ్మతులు చేయకపోతే ఏపీ నిండా మునిగిపోతుందని ‘నీళ్ల మనిషి’గా పేరొందిన రాజేంద్ర సింగ్ చెప్పడం దీనికి కారణం. డ్యాం భద్రత కోసం చర్యలు తీసుకోవాలని పార్టీలు కోరుతున్నాయి. అయితే డ్యాంకు ఎలాంటి ముప్పూ లేదని ప్రభుత్వం అంటోంది. 

శ్రీశైలం ప్రాజెక్టు సూపరింటిండెంట్ ఇంజినీరు చంద్రశేఖర్ రావు డ్యాం స్థితిగతులపై వివరణ కూడా ఇచ్చారు.  ‘ప్రాజెక్టు చాలా భద్రంగా ఉంది. భూకంప(సీస్మిక్) ప్రభావం కూడా లేదు. డ్యాం భద్రతపై త్వరలో ప్లంజ్ పూల్ సర్వే నివేదికలు రానున్నాయి. వాటిని డ్యామ్ సేఫ్టీ కమిటీకి అందజేస్తాం. భద్రతపై కేంద్ర జలవనరుల సంఘం కూడా సంతృప్తి వ్యక్తం చేసింది’ అని చెప్పారు. డ్యాంకు ఎలాంటి పగుళ్లూ లేవని స్పష్టం చేశారు. ‘ప్రతి ఏడాది ఫ్లాంక్ ప్రొటెక్షన్ పనులు, గేట్ మెయింటెనెన్స్ పనులు, గ్యాలరీ నిర్వహణ పనులు సక్రమంగా నిర్వహిస్తుంటాం. ఈ ఏడాది కూడా మెయింటెనెన్స్‌ సర్వే చేశాం నివేదిక రాగానే చర్యలు తీసుకుంటాం’ అని ఓ ప్రకటనలో తెలిపారు. 

ఇప్పటికిప్పుడు ప్రమాదం లేదని ప్రభుత్వం చెబుతున్నా.. ఐదు దశాబ్దాల కిందట నిర్మించిన ఈ ప్రాజెక్టుకు కొన్ని మరమ్మతుల అవసరం ఉందని నిపుణులు భావిస్తున్నారు. 2009 నాటి భారీ వరద సమయంలో గేట్ల ద్వారా నీళ్లు వదిలారు. వరద ఉధృతికి 6వ నెంబర్‌ గేటుకు ఎదురుగా 150 అడుగుల గుంత పడింది. అరకొర మరమ్మతులు పూర్తి చేసి వదిలేశారు. వరదల్లో కుడిగట్టు రక్షణ గోడ కూడా దెబ్బతింది. అయితే దాని వల్ల ఎలాంటి సమస్యలూ తలెత్తలేదు.