Srivari temple is closed for two days
mictv telugu

భక్తులకు అలర్ట్.. రెండ్రోజులు శ్రీవారి ఆలయం మూసివేత

September 7, 2022

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్ధం భక్తులు భారీగా వస్తుంటారు. కానీ, రెండ్రోజుల పాటు ఆలయం మూసివేస్తున్నట్టు టీటీడీ బుధవారం ప్రకటించింది. రానున్న రెండు నెలల్లో ఈ పరిణామం చోటు చేసుకుంటుందని అందుకు గల కారణాలను కూడా తెలిపింది. అక్టోబర్ 25న సూర్యగ్రహణం ఉన్నందున ఉదయం 8.11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తామని వెల్లడించింది. అలాగే నవంబర్ 8న చంద్రగ్రహణం కారణంగా ఉదయం 8.40 నుంచి రాత్రి 7.20 గంటల వరకు మూసివేస్తామని వివరించింది. ఈ రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనం, శ్రీవాణి ట్రస్టు దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. రెండ్రోజులు గ్రహణం వీడిన తర్వాత ఆలయాన్ని శుద్ది చేసి కేవలం సర్వ దర్శన భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని స్పష్టం చేసింది.